Mumbai : భారతదేశ ఆర్థిక రాజధానిగా ముంబైకి పేరు. కానీ ఇప్పుడు అది ఓ చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ముందు వరుసలో నిలిచింది. ఈ జాబితాలో గతంలో దేశ రాజధాని ఢిల్లీ ఉండేది.. కానీ, స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ ఐక్యూ ఎయిర్ జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8వ తేదీల మధ్య తయారు చేసిన జాబితాలో ముంబై ఆ ప్లేస్ దక్కించుకుంది. జనవరి 29న ఇదే ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న ముంబై.. ఫిబ్రవరి 2నాటికి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా తొలిస్థానాల్లోకి చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం. తర్వాత ఫిబ్రవరి 8న మళ్లీ రెండో స్థానానికి చేరింది. ఫిబ్రవరి 13న, వాయు నాణ్యతలో ప్రపంచవ్యాప్తంగా మూడో అత్యంత అనారోగ్యకరమైన నగరంగా నిలిచింది.
Read Also: WPL 2023: వేలం అద్భుతంగా నిర్వహించింది: మల్లికా సాగర్‌పై ప్రశంసలు
గత నవంబర్‌తో పాటు ఈ ఏడాది జనవరి నెలల్లో ముంబైలో గాలి నాణ్యత ఎక్కువగా ‘పూర్’, ‘వెరీ పూర్’ కేటగిరీలోనే నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాలు వెల్లడించాయి. రోడ్లపై ఎగసిపడే దుమ్ము, వాహనాల నుంచి పొగ వల్ల గాలి నాణ్యత పడిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చలికాలం కావడం, నిర్మాణ వ్యర్థాలే ఈ పరిస్థితికి కారణమని వెల్లడించారు. లా నినా సైక్లోన్ ఎఫెక్ట్ తో గాలి వేగం నెమ్మదించడం వల్ల కూడా ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని పేర్కొన్నారు. మరోవైపు నగరంలో గాలి నాణ్యత పడిపోవడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రాబోయే 10 రోజుల పాటు నగరంలో నిర్మాణ కార్యకలాపాలను నిషేధించింది.