Site icon NTV Telugu

Mukesh Choudhary: ఐపీఎల్ నుండి మధ్యలోనే మరో CSK ప్లేయర్ అవుట్..!

Mukesh Choudhary

Mukesh Choudhary

Mukesh Choudhary: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు వరుసగా సమస్యలు ఎదురవుతున్నాయి. గాయాలు, ఫామ్ లోపం వంటి ఇబ్బందులతో పాటు ఇప్పుడు వ్యక్తిగత విషయాలు కూడా జట్టును కలవరపెడుతోంది. జట్టు యువ పేసర్ ముఖేష్ చౌదరి తన తల్లి ప్రేమ్ దేవిని కోల్పోవడం CSK శిబిరంలో విషాదాన్ని నింపింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన CSK, కేవలం 2 విజయాలతో మాత్రమే పరిమితమైంది.

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో ఆడుతున్న ఈ జట్టు మొదటి మూడు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ, తరువాత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి కాస్త ఊపందుకుంది. అయితే చివరి మ్యాచ్‌లో మరోసారి ఓటమి చవిచూసింది. ఇప్పటికే జట్టుకు గాయాల రూపంలో పెద్ద దెబ్బలు తగిలాయి. MS ధోని, డెవాల్డ్ బ్రెవిస్ గాయాలతో బాధపడుతుండగా, అయుష్ మాత్రే కూడా హ్యామ్‌ స్ట్రింగ్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇటీవల ఖలీల్ అహ్మద్ కూడా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

ఇలాంటి సమయంలో ఖలీల్ అహ్మద్ స్థానంలో కొత్త బంతితో బౌలింగ్ బాధ్యతలు తీసుకున్న ముకేశ్ చౌధరీకి వ్యక్తిగత విషాదం ఎదురైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఈ వార్తతో CSK జట్టు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ముకేశ్ తన స్వగ్రామం రాజస్థాన్‌లోని భిల్వారాకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్‌తో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు అతను దూరమయ్యే అవకాశం ఉంది. ఈ కష్ట సమయంలో CSK ఫ్యామిలీ అతనికి మద్దతుగా నిలుస్తూ సంతాపం వ్యక్తం చేసింది.

ముకేశ్ గైర్హాజరీలో CSKకు కొత్త బంతి బౌలింగ్‌లో లోటు ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ అనుభవజ్ఞుడు మాట్ హెన్రీను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే అతన్ని తీసుకుంటే ఇతర విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ విభాగంలో కూడా సమస్యలు కొనసాగుతున్నాయి. అయుష్ మాత్రే స్థానంలో కొత్త ఆటగాడిని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు జట్టు కీలక ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ CSKకు ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. ముంబైలో జరగనున్న కీలక మ్యాచ్‌లో జట్టు తిరిగి ఫామ్ అందుకుంటే పోటీలో నిలబడే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version