Site icon NTV Telugu

Mukesh Ambani: ‘మా దగ్గర బెస్ట్ షూటర్ ఉన్నాడు.. 20కోట్లు ఇవ్వకుంటే చంపేస్తాం’.. ముకేశ్ అంబానీకి బెదిరింపు

Mukhesh Ambani

Mukhesh Ambani

Mukesh Ambani: దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. అంబానీ అధికారిక ఇమెయిల్ ఐడీకి బెదిరింపు వచ్చింది. తనకు భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు పరిచయంలో ఉన్నారని ఈమెయిల్ పంపిన వ్యక్తి చెప్పాడు. 20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ మెయిల్ అక్టోబర్ 27న వచ్చింది. ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ముంబైలోని గామ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరనే దానిపై విచారణ జరుగుతోంది. “మాకు రూ. 20 కోట్లు ఇవ్వకుంటే నిన్ను చంపేస్తాం. భారతదేశంలో అత్యుత్తమ షూటర్లు మా వద్ద ఉన్నారు” అని బెదిరింపు ఇమెయిల్‌లో రాసుకొచ్చారు.

ఈ ఇమెయిల్‌ను స్వీకరించిన తర్వాత, ముఖేష్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు IPC సెక్షన్‌లు 387, 506 (2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై FIR నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇమెయిల్ పంపబడిన IP చిరునామా కోసం గాలిస్తున్నారు. ముకేశ్ అంబానీకి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో ఒక వ్యక్తి నాగ్‌పూర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ముఖేష్ అంబానీ ఇంటి “యాంటిలియా”ని పేల్చివేస్తానని బెదిరించాడు. ఇది జరిగిన వెంటనే పోలీసులు యాంటిలియా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అంతకు ముందు కూడా అంబానీకి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయి. అతను దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత్త, భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారు. అందుకే వారి భద్రత విషయంలో ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది.

Exit mobile version