Mujeeb Ur Rahman Gets Hit Wicket Again in ODI Cricket: క్రికెట్ అనేది ఓ క్రేజీ గేమ్. ఈ గేమ్‌లో దురదృష్టం వెక్కిరిస్తే.. ఎంతటి టాప్ క్లాస్ బ్యాటర్ అయినా పెవిలియన్ చేరాల్సిందే. బౌలర్లు ఎంత ప్రయత్నించినా.. అవుట్ కాని బ్యాటర్లు కొన్నిసార్లు తమ స్వంత తప్పిదం వలన ‘సెల్ఫ్ అవుట్’ అవుతూ ఉంటారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇప్పటికే క్రికెట్ ఆటలో చోటుచేసుకున్నాయి. తాజాగా ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆసియా కప్ 2023లో భాగంగా ఆదివారం లహోర్ వేదికగా బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్ ఉహించని రీతిలో ఔటయ్యాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 45 ఓవర్ తస్కిన్ అహ్మద్ వేయగా.. ముజీబ్ భారీ షాట్ ఆడాడు. బంతి వెళ్లి స్టాండ్స్‌లో పడింది. అయితే బంతిని కొట్టే క్రమంలో ముజీబ్ కాలు స్టంప్స్‌ను తాకింది. దాంతో బెయిల్స్ కిందపడిపోయాయి. ఇంకేముంది రహీమ్ ఔట్ అంటూ బంగ్లా ప్లేయర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘పాపం ముజీబ్.. సిక్స్ కొట్టి మరి పెవిలియన్‌కు చేరాడు’అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హిట్-వికెట్ అవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే క్రికెట్‌లో రెండుసార్లు మరియు బ్యాక్-టు-బ్యాక్ గేమ్‌లలో హిట్-వికెట్‌గా అవుట్ అయిన మొదటి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. ఇటీవల హంబన్‌తోటలో పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో ముజీబ్ ఇలానే పెవిలియన్ చేరాడు.
Also Read: Hyderabad: నిరుద్యోగుల నుంచి కోట్లు గుంజి.. బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ!
ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ 89 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 రన్స్ చేసింది. మెహదీ హసన్ మిరాజ్ (112; 119 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), నజ్ముల్ హోసేన్ షాంతో (104; 105 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. అనంతరం లక్ష్య ఛేదనతో అఫ్గాన్ 44.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (74), హష్మతుల్లా ( 51) రాణించారు.