Fire Accident: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఇంట్లో అగ్ని ప్రమాదం.. నిప్పు పెట్టిన దుండగులు..

Fire

Fire

బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు, దహనకాండ నేపథ్యంలో నోబెల్ బహుమతి గ్రహీత, ఆ దేశ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటికి దుండగులు నిప్పు పెట్టారు. నవంబర్ 18, బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో చట్టోగ్రామ్ నగరంలోని పాంచ్‌లైష్ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఓ పాడుబడిన గదికి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో సాధారణ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు మంటలను గమనించి వెంటనే లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తెచ్చారని పాంచ్‌లైష్ పోలీస్ స్టేషన్ అధికారి మొజమ్మెల్ హక్ తెలిపారు. ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎవరూ నివసించడం లేదని, మంటలు చెలరేగిన గది కూడా చాలా ఏళ్లుగా ఉపయోగంలో లేదని ఆయన పేర్కొన్నారు.

అయితే.. రెండో, మూడో అంతస్తులలో యూనస్ ఇద్దరు సోదరుల కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ ఘటన తర్వాత ఆ ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల యూనస్‌కు సంబంధించిన ఆస్తులు, సంస్థలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఆయన స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్‌కు చెందిన రెండు శాఖలకు కూడా ఇటీవల చట్టోగ్రామ్‌లోని అన్వారా, సత్కానియా ప్రాంతాల్లో దుండగులు నిప్పు పెట్టారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు యూనస్‌కు సంబంధించిన సంస్థల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.

మైక్రోఫైనాన్స్ రంగంలో చేసిన కృషికి 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్, విద్యార్థుల నిరసనలతో మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగిన 2024 ఆగస్టు 8న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. 2026 ఫిబ్రవరి 12న దేశంలో పార్లమెంటరీ ఎన్నికలు జరిగే వరకు ఆయన పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత తారిఖ్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో యూనస్ తాత్కాలిక పాలన ముగిసింది. తాజా అగ్నిప్రమాదం వెనుక ఉన్న ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, గ్రామీణ్ బ్యాంక్ శాఖలపై జరిగిన దాడులకు, ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.