MS Dhoni About Rafael Nadal: స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పేశాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్ తనకు చివరిదని వెల్లడించాడు. 2004లో కెరీర్ మొదలుపెట్టిన నాదల్.. ఆ రోజుల్లో ఆండీ రాడిక్, లీటన్ హెవిట్, రోజర్ ఫెదరర్ వంటి దిగ్గజాల మధ్య సంచలన ఆటతో దూసుకొచ్చాడు. మట్టికోట మహారాజుగా పేరుగాంచిన నాదల్.. 20 ఏళ్ల కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు. స్పెయిన్ బుల్ టెన్నిస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించాడు.
రఫేల్ నాదల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘నేను ఎప్పుడూ రఫేల్ నాదల్‌ను నా రెండో అభిమాన ప్లేయర్‌గానే చూశాను. నాకు ఆండ్రీ అగస్సీ ఆట అంటే చాలా ఇష్టం. అతడినే నేను ఎక్కువగా అభిమానిస్తా. అగస్సీ తరువాత స్టెఫీగ్రాఫ్‌కు మద్దతు ఇచ్చేవాడిని. స్టెఫీగ్రాఫ్ తర్వాత ఆ స్థానంలో నాదల్ వచ్చాడు. ప్రపంచంలోనే నంబర్‌వన్ ర్యాంకర్‌గా అవతరించాడు. నాదల్ ఎప్పుడూ తన ఆటిట్యూడ్‌ను మార్చుకోలేదు. ఓడినా, గెలిచినా.. ఒకేలా స్వీకరించేతత్వం నాదల్ది. మ్యాచ్ ఓడిపోతానని తెలిసినా చివరి వరకూ పోరాడతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓటమిని అంగీకరించడు’ అని ధోనీ చెప్పుకొచ్చారు.
Also Read: Viswam Twitter Review: గోపీచంద్ ‘విశ్వం’ ట్విటర్ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?
38 ఏళ్ల రఫెల్ నాదల్ కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలవగా.. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉండడం గమనార్హం. యుఎస్ ఓపెన్ 4, వింబుల్డన్ 2, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2 టైటిల్స్ గెలిచాడు. అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచిన రెండో ప్లేయర్‌గా స్పెయిన్ బుల్ నిలిచాడు. సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ (24) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (20) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. నాదల్ ఇప్పటివరకు 135 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని సొంతం చేసుకున్నాడు.