NTV Telugu Site icon

MS Dhoni: ఇట్స్ అఫీషియల్.. చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టిన ఎంఎస్ ధోని

Dhoni

Dhoni

MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వారి జట్టుకు నాయకత్వం బాధ్యతను మరోమారు ఎంఎస్ ధోనికి కట్టబెట్టింది. రుతురాజ్ గైక్వాడ్ గాయపడిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మళ్లీ కెప్టెన్‌గా నియమించినట్లు సీఎస్కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం సీఎస్కే కెప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఫ్రాక్చర్‌తో ఇబ్బందిపడుతున్నాడు. మొదట్లో చిన్న గాయం అనుకున్నా.. కానీ, పరీక్షల తర్వాత పూర్తిగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా రుతురాజ్ టాస్‌కు వచ్చి మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ, ఆడే సమయంలో అతడి గాయ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు, సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఈ విషయాన్ని తెలిపారు. గైక్వాడ్ గాయపడటంతో అతని స్థానంలో ధోనిని మళ్లీ కెప్టెన్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వెల్లడించారు. దీంతో ఐపీఎల్ 2025లో మళ్లీ ధోని సీఎస్కేకు నాయకత్వం వహించనున్నాడు. ఇక ఎంఎస్ ధోని నాయకత్వంలో సీఎస్కే ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2023లో అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించింది. ఆ మ్యాచ్ ధోని కెప్టెన్‌గా చివరి మ్యాచ్‌గా జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు ఎంఎస్ ధోని చెప్పడంతో అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయాయి.