MS Dhoni IPL 2027 Future: ఐపీఎల్ వచ్చే సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడతాడా లేదా అనే అంశంపై ఆయన ఓ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు తన ఐపీఎల్ భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. గతేడాది పిక్క గాయం (Calf issues) కారణంగా ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. అదే సీజన్లో చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది. దీంతో ధోనీ ఆటపై, ఆయన రిటైర్మెంట్పై రకరకాల వార్తలు బయటకు వచ్చాయి.
ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ హెల్త్‌కేర్ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీకి మళ్లీ ఇదే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన తనదైన శైలిలో సరదాగా సమాధానమిచ్చారు. “ముందుగా డాక్టర్లు నాకు ఫిట్నెస్ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. దానిని బట్టి వచ్చే సీజన్లో ఆడేంత బలంగా ఉన్నానా లేదా అనేది డిసెంబర్ లోపు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ నేను ఫిట్‌గా లేకపోతే, నన్ను మళ్లీ రన్నింగ్ కండిషన్లోకి తీసుకురావాల్సిన బాధ్యత డాక్టర్లదే! ఈ ఓల్డ్ వింటేజ్ వాహనం రోడ్డుపై సరిగ్గా పరిగెత్తాలంటే వాళ్లే అంతా చూసుకోవాలి. కాబట్టి ప్రెజర్ అంతా ఇప్పుడు డాక్టర్ల పైనే ఉంది” అంటూ నవ్వులు పూయించారు.
మరోవైపు ధోనీ ఐపీఎల్ 2027లో కూడా చెన్నై జెర్సీలో కనిపిస్తాడని సీఎస్కే మేనేజ్మెంట్ ఆశాభావంతో ఉంది. ధోనీ నిర్ణయం పైనే అంతా ఆధారపడి ఉందని చెబుతూనే.. ఆయన మళ్లీ బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ధోనీ చెన్నైకి వచ్చినప్పుడే తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇక గతేడాది ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన సీఎస్కే, తమ సహాయక సిబ్బందిలో భారీ మార్పులు చేసింది. ఇప్పటివరకు హెడ్ కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్ స్థానంలో భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ బాధ్యతలు స్వీకరించారు.

