NTV Telugu Site icon

MS Dhoni: ఎంఎస్‌ ధోనీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ హిస్టరీలోనే మొదటి ఆటగాడు!

Ms Dhoni

Ms Dhoni

చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌గా బరిలోకి దిగడంతో మహీ ఈ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు ఏ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ కెప్టెన్‌గా వ్యవహరించలేదు.

బీసీసీఐ రూల్స్ ప్ర‌కారం.. గ‌త ఐదేళ్ల‌లో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏ ఆటగాడు అయినా అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌గా ప‌రిగ‌ణించ‌బడతాడు. ఐదేళ్ల క్రితం 2019లో మహీ చివరగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్‌క్యాప్డ్‌ కోటాలో రూ.4 కోట్లు వెచ్చించి సీఎస్‌కే అతడిని రిటైన్ చేసుకుంది. సీఎస్‌కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీ మొత్తంకు దూరమయ్యాడు. దాంతో ధోనీ మరలా చెన్నై పగ్గాలు అందుకున్నాడు. దాంతో ధోనీ ఐపీఎల్ హిస్టరీలోనే అన్‌క్యాప్డ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అతి పెద్ద వయస్కుడిగా ధోనీ (43 సంవత్సరాల 278 రోజులు) మరో ఘనత సాధించాడు.

Also Read: Gorantla Madhav: రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్!

2008లో చెన్నై కెప్టెన్సీ చేపట్టిన ఎంఎస్ ధోనీ.. 2021 వరకు విజయవంతంగా కొనసాగాడు. ఈ కాలంలో నాలుగు సార్లు (2010, 2011, 2018, 2021) జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. 2022లో రవీంద్ర జడేజా సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు. వరుస మ్యాచ్‌లలో ఓడిపోవడంతో జడేజా స్వయంగా కెప్టెన్సీని విడిచిపెట్టాడు. దాంతో సీఎస్‌కే ఫ్రాంచైజీ ధోనీని మరోసారి కెప్టెన్‌ను చేసింది. 2023లో కూడా ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించి.. సీఎస్‌కేను విజేతగా నిలిపాడు. 2024లో ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఐపీఎల్ 2025లో రుతురాజ్‌ గాయం కారణంగా.. ధోనీ మళ్లీ సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు.