Site icon NTV Telugu

LSG vs CSK: మెరిసిన ధోనీ, దూబే.. 5 ఓటముల తర్వాత చెన్నై విజయం

Ms Dhoni

Ms Dhoni

ఐపీఎల్‌ 2025లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. అయిదు ఓటముల తర్వాత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సోమవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎంఎస్ ధోనీ (26 నాటౌట్‌; 11 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. శివమ్‌ దూబే (43 నాటౌట్‌; 37 బంతుల్లో 3×4, 2×6) రాణించాడు. అంతకు ముందు చెన్నై బౌలర్ నూర్‌ అహ్మద్‌ (0/13) ఎల్‌ఎస్‌జీని కట్టడి చేశాడు. ఈ విజయంతో సీఎస్‌కే ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఇడెన్ మార్‌క్రమ్‌ (6), నికోలస్ పూరన్‌ (4) విఫలమవడంతో లేకనో ఇన్నింగ్స్‌ నత్తనడకన సాగింది. ఈ సమయంలో మిచెల్ మార్ష్‌ (30; 25 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి రిషబ్ పంత్‌ (63; 49 బంతుల్లో 4×4, 4×6) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మార్ష్‌ అవుట్ అయ్యాక ఆయుష్ బదోని (22), అబ్దుల్ సమద్‌ (20)ల సహకారంతో పంత్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 18, 19 ఓవర్లలో పంత్ సిక్సర్లు బాదడంతో ఎల్‌ఎస్‌జీ స్కోర్ 150 దాటింది. చివరి ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 11 పరుగులే చేసింది. జడేజా (2/24), పతిరన (2/45) రాణించారు.

ఛేదనలో చెన్నైకి మంచి ఆరంభం దక్కింది. షేక్‌ రషీద్‌ 27; 19 బంతుల్లో 6×4) బౌండరీల మోత మోగించాడు. రచిన్‌ రవీంద్ర (37; 22 బంతుల్లో 5×4) నిలకడగా ఆడడంతో చెన్నై 4 ఓవర్లకు 45 పరుగులు చేసింది. అయితే ఊపుమీదున్న రషీద్‌ను అవేష్‌ ఔట్‌ చేశాడు. కొద్దిసేపటికి రచిన్‌ను మార్‌క్రమ్‌ ఔట్‌ చేసి కష్టాల్లోకి నెట్టాడు. మరోవైపు రవి బిష్ణోయ్‌ (2/18), దిగ్వేశ్‌ రాఠి (1/23) కూడా సీఎస్‌కే బ్యాటర్లను కట్టడి చేశారు. చివరి 5 ఓవర్లలో చెన్నై 56 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎంఎస్ ధోనీ చెలరేగాడు. శార్దూల్‌ వేసిన 19వ ఓవర్లో 19 పరుగులు రావడంతో.. చెన్నైకి ఆఖరి ఓవర్లో 5 పరుగులే అవసరం అయ్యాయి. దూబే ఫోర్‌ కొట్టి చెన్నైకి విజయాన్ని అందించాడు.

Exit mobile version