చేవెళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. అర్హులైన ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలను అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆయన సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వారు శంషాబాద్ మండలం నర్కూడ, చౌదరిగూడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తొలుత ఆమె సీతారామస్వామిని అమ్మపల్లి ఆలయంలో దర్శించుకున్నారు. అనంతరం నర్కూడ, చౌదరిగూడ గ్రామాల్లో గడప గడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకం ద్వారా స్త్రీలకు ప్రతి నెల రూ. 2500 ఆర్థిక భరోసా ఉంటుందని అన్నారు. రూ. 500/ – లకే గ్యాస్ సిలిండర్ తో పాటు… ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నట్టు వివరించారు. రైతు భరోసా, చేయూత, యువ వికాస్ వంటి పథకాలతో ప్రజలకు లబ్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో సీతా రెడ్డి వెంట తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, శంషాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శేఖర్ యాదవ్, ఎంపీటీసీ గౌతమి తదితర నేతలు పాల్గొన్నారు.