మరోసారి సీఎం కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నాయకులు, ఎంపీ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన నారాయణపేట దామరగిద్దలో మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల టీఆర్‌ఎస్ పాలన ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పాలన సాగిస్తోందని, రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను అణచివేసే సంస్కృతి కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేలను బయటికి పంపించి సమావేశాలు నిర్వహించిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి దక్కిందన్నారు లక్ష్మణ్. రజాకార్ల పాలనను తలదన్నే రీతిలో పాలన సాగిస్తున్నారని, గురుకుల పాఠశాలలో విద్యార్థుల భోజనాల్లో పురుగులు వస్తున్న వాటిని పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వం స్పందించలేదని, రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో వున్నారు.
వాటిని తెలుసుకునేందుకు ప్రజా గోసా.. బీజేపీ భరోసా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని, కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉచితంగా బియ్యం ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కేంద్రం ద్వారా వచ్చిన డబ్బులను రాష్ట్రం తన పథకాలకు వాడుకుంటుందని, ప్రధాని అవస్ యోజన కింద దేశంలో 3 కోట్లకు పైగా పేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చిన ఘనత మోడీ ది అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామన్నారు.