మధ్యప్రదేశ్లోని మోహన్ యాదవ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గత 25 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ను పూర్తిగా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మందసౌర్ లోని గాంధీసాగర్లో జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1961కి సవరణ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ తాజా నిర్ణయంతో ఇకపై మూడో సంతానం ఉన్నప్పటికీ ఏ ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించరు.
అలాగే కొత్త ఉద్యోగాల నియామకాల్లోనూ ముగ్గురు పిల్లలున్న అభ్యర్థులు అనర్హులు కారు. దీనివల్ల ఒక్క స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే 30 వేలకు పైగా ఉపాధ్యాయులకు ప్రత్యక్ష ప్రయోజనం కలగనుంది. వివిధ విభాగాల్లో ఈ నిబంధనకు సంబంధించి సుమారు 8 నుంచి 10 వేల పెండింగ్ కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలకు చెందిన ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది.
ఈ నిబంధనను ఎత్తివేసినప్పటికీ ప్రభుత్వం ఒక కీలకమైన షరతు విధించింది. 2001 సంవత్సరం తర్వాత ఎవరైతే ఉద్యోగులపై ఇప్పటికే అంతిమ ఉత్తర్వులు జారీ చేయబడి సర్వీసుల నుంచి తొలగించబడ్డారో, వారి పాత కేసులను మాత్రం తిరిగి తెరిచి విచారించరు. అంటే గతంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ సడలింపు వర్తించదు. ఈ కఠిన నిబంధనను 26 జనవరి 2001న అప్పటి సీఎం దిగ్విజయ్ సింగ్ హయాంలో జనాభా నియంత్రణ ఉద్దేశంతో అమలు చేశారు.
గతంలో ఈ నిబంధన ఎంత కఠినంగా ఉండేదంటే, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కారణంగా కొందరు జ్యుడీషియల్ అధికారులను కూడా ఉద్యోగాల నుంచి తొలగించారు. కాగా, మధ్యప్రదేశ్ కంటే ముందే రాజస్థాన్ (2016), ఛత్తీస్గఢ్ (2017) రాష్ట్రాలు కూడా ఈ నిబంధనను రద్దు చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మూడో సంతానం ఉన్నవారికి ఏకంగా రూ. 25,000 ప్రోత్సాహకం ప్రకటించడం గమనార్హం.

