కుటుంబ కలహాలు, ఆస్తుల పంచాయితీలతో తల్లిదండ్రులపై పిల్లలు దాడులకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పిల్లల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు అంతమొందిస్తున్నారు. తాజాగా ఉమానగర్, పంజాగుట్టలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రలో ఉన్న యువకుడిని స్వంత తల్లి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు హర్ష వర్ధన్ (27) గా పోలీసులు గుర్తించారు. ఆయన తల్లి గంగులమ్మ (50) ఇళ్లలో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది.
Also Read:Theft: వింత దొంగతనం.. ఇంటి ముందున్న వ్యక్తిని, బైక్ ను తీసుకెళ్లిన యువకుడు.. తర్వాత బైక్ తో పరార్
గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో హర్ష వర్ధన్ నిద్రిస్తున్నప్పుడు, అతని తల్లి మరో ఇద్దరు యువకులు టవల్‌తో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు జులాయి స్వభావం కలిగి తరచుగా మద్యం సేవించి, తల్లిని డబ్బుల కోసం వేధింపులకు గురిచేసేవాడని, అదే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన అనంతరం నిందితులు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
