Site icon NTV Telugu

Mother Diary: సామాన్యులపై మళ్లీ భారం.. మదర్‌ డెయిరీ పాల ధర పెంపు

Mother Dairy

Mother Dairy

Mother Diary: ముందే ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువులు, కూరగాయలు, పాల ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యుడికి తీవ్ర భారంగా మారుతోంది. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మ‌ద‌ర్ డెయిరీ మ‌ళ్లీ పాల ధ‌ర‌లు పెంచేసింది. ఫుల్ క్రీమ్ లీట‌ర్ పాల‌పై రూపాయి, టోకెన్ మిల్క్ లీట‌ర్‌పై రూ.2 ధ‌ర పెంచుతున్నట్లు తెలిపింది. ఢిల్లీతోపాటు దేశ రాజ‌ధాని ప్రాంతం (ఎన్సీఆర్‌) ప‌రిధిలో సోమ‌వారం నుంచి పెరిగిన ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌స్తాయి. ఈ విషయాన్ని కంపెనీ ఆదివారం ప్రకటించింది. మదర్ డెయిరీ ఈ ఏడాది పాల ధరలను పెంచడం ఇది నాలుగోసారి. డెయిరీ రైతుల నుండి ముడి పాల సేకరణ ధర పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మదర్ డెయిరీ ప్రతినిధి తెలిపారు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప‌రిధిలో మదర్‌ డెయిరీ ప్రతి రోజూ 30 ల‌క్షల లీట‌ర్లకు పైగా పాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తుంది. దీని ప్రకారం ఫుల్ క్రీమ్ పాలు లీట‌ర్ ధ‌ర రూపాయి పెరిగి రూ.64ల‌కు చేరుకుంది

అయితే 500 ఎంఎల్ ప్యాక్‌లలో విక్రయించే ఫుల్‌క్రీమ్ పాల ధరలను కంపెనీ సవరించలేదు. టోకెన్ పాలు (బల్క్-వెండెడ్ మిల్క్) లీటరుకు రూ.2 పెరిగి రూ.48 నుంచి రూ. 50 చొప్పున విక్రయించబడుతుంది. అయితే ధరలు పెంచడానికి గల కారణాలను వివరించింది మదర్‌ డెయిరీ. ఇన్‌పుట్ ధర పెర‌గ‌డంతో పాల ధ‌ర‌లు పెంచ‌క త‌ప్పలేద‌ని పేర్కొంది. ప‌శుగ్రాసం, దాణా వంటి ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో తప్పనిసరిగా ధరలు పెంచాల్సి వచ్చిందని మదర్‌ డెయిరీ ప్రతినిధులు తెలిపారు. పాల ఉత్పత్తుల డిమాండ్‌కు స‌ర‌ఫ‌రా మ‌ధ్య గ్యాప్ చాలా ఎక్కువ‌గా ఉంద‌ని మ‌ద‌ర్ డెయిరీ అధికార ప్రతినిధి తెలిపారు. డిమాండ్‌కు త‌గిన‌ట్లు పాల స‌ర‌ఫ‌రా జ‌రుగ‌డం లేదు. ఫెస్టివ్ సీజ‌న్ త‌ర్వాత త‌లెత్తిన ప‌రిణామాల‌తో పాల ధ‌ర‌లు పెంచ‌క త‌ప్పడం లేద‌ని మ‌ద‌ర్ డెయిరీ ప్రకటించింది.

goods train derailed: పట్టాలు తప్పి వెయిటింగ్‌ హాల్లోకి దూసుకెళ్లిన గూడ్స్‌ రైలు.. ముగ్గురు మృతి

అక్టోబర్‌లో మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్‌సీఆర్, ఉత్తర భారతదేశంలోని కొన్ని ఇతర మార్కెట్‌లలో ఫుల్-క్రీమ్ మిల్క్, ఆవు పాల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచింది. మార్చి, ఆగస్టులలో అన్ని వేరియంట్‌లకు కూడా లీటరుకు రూ. 2 చొప్పున రేట్లు సవరించబడ్డాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే విజయ, ఆమూల్, హెరిటేజ్ పాల ధరలను పెంచగా, ఇప్పుడు మదర్ డెయిరీ కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ పాల ధరల పెంపు సామాన్యులకు కొంత భారంగానే మారనుంది. పాల ఉత్పత్తికి అయ్యే ఖ‌ర్చుల్లో 75-80 భారం వినియోగ‌దారుల‌పైనే మ‌ద‌ర్ డెయిరీ మోపుతుంది.

Exit mobile version