NTV Telugu Site icon

Man Of The Match: ఐపీఎల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు వీరే

Ipl 2025 (1)

Ipl 2025 (1)

Man Of The Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మార్చి 22న మొదలు కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఈ లీగ్‌లో ప్రతి సీజన్‌లోనూ కొత్త రికార్డులు, అద్భుత ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన ఆటగాళ్లకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభిస్తుంది. ఈ అవార్డును ఎక్కువసార్లు గెలుచుకున్న ఆటగాళ్లు ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మరి ఇప్పుడు, ఐపీఎల్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్లు ఎవరో చూద్దామా.

1. ఏబీ డివిలియర్స్ (AB de Villiers):
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ మాస్టర్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు. 2008-2021 మధ్యకాలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన డివిలియర్స్ మొత్తం 184 మ్యాచ్‌లు ఆడి 25 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అతని వైవిధ్యమైన షాట్లు, ఫినిషింగ్ సామర్థ్యం అభిమానులను ఎప్పటికీ గుర్తు ఉంటాయి.

2. క్రిస్ గేల్ (Chris Gayle):
టీ20 క్రికెట్‌కు కింగ్‌గా పేరు తెచ్చుకున్న యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. 2009-2021 మధ్యకాలంలో అతను కింగ్స్ XI పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 142 మ్యాచ్‌లు ఆడి 22 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అలాగే ఒక మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు.

Read Also: IPL History: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్లు ఎవరంటే!

3. రోహిత్ శర్మ (Rohit Sharma):
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన అద్భుత బ్యాటింగ్‌తో 19 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. 2008 నుండి ఇప్పటి వరకు డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున 257 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచాడు.

4. విరాట్ కోహ్లీ (Virat Kohli):
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐకాన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2008-2024 మధ్యకాలంలో 252 మ్యాచ్‌లు ఆడి 18 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ ముందంజలో ఉన్నాడు.

5. డేవిడ్ వార్నర్ (David Warner) – 18 అవార్డులు
సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్ 2009-2024 మధ్యకాలంలో 184 మ్యాచ్‌లు ఆడి 18 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అంతేకాదు, ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లలో వార్నర్ ముందుంది.

6. ఎంఎస్ ధోని (MS Dhoni):
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీతోనే కాకుండా బ్యాటింగ్‌తోనూ మెరిసాడు. 2008-2024 మధ్యకాలంలో 264 మ్యాచ్‌లు ఆడి 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. తన ఫినిషింగ్ స్టైల్, గేమ్ అవగాహన ధోనిని ప్రత్యేకమైన ఆటగాడిగా నిలిపాయి. అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మొదటి స్థానంలో నిలిచాడు.

7. రవీంద్ర జడేజా (Ravindra Jadeja):
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 2008-2024 మధ్య 240 మ్యాచ్‌లు ఆడి 16 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. గుజరాత్ లయన్స్, రాజస్థాన్ రాయల్స్, కొచ్చి టస్కర్స్ కేరళ తరఫున కూడా జడేజా ఆడాడు.

8. యూసఫ్ పఠాన్ (Yusuf Pathan):
ఐపీఎల్‌లో అత్యంత ప్రభావవంతమైన హిట్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న యూసఫ్ పఠాన్ 2008-2019 మధ్య 174 మ్యాచ్‌లు ఆడి 16 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతను మెరుగైన ఆటతీరు కనబరిచాడు.

9. షేన్ వాట్సన్ (Shane Watson):
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ 2008-2020 మధ్య 145 మ్యాచ్‌లు ఆడి 16 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. అతను రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. అలాగే 2 సార్లు మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డులను కూడా గెలుచుకున్నాడు.

10. సునీల్ నరైన్ (Sunil Narine):
కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ 2012-2024 మధ్య 177 మ్యాచ్‌లు ఆడి 15 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో పాటు, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా కూడా రాణించగలిగాడు.

11. ఆండ్రే రస్సెల్ (Andre Russell):
కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన ఆండ్రే రస్సెల్ 2012-2024 మధ్య 127 మ్యాచ్‌లు ఆడి 15 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అతని దూకుడు బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్ పర్‌ఫార్మెన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నాడు.