Site icon NTV Telugu

Odisha: బీజేడీలో రికార్డ్ బ్రేక్.. పోటీకి 10 వేల మంది అప్లై!

Odisa

Odisa

దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు నవీన్ పట్నాయక్(Naveen Patnaik). ఇటీవలే ఓ జాతీయ సర్వేలో ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు. అంతేనా? అంటే ఆయనకు ఇంకో గుర్తింపు ఉంది. వరుసగా ఐదుసార్లు గెలిచి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా మళ్లీ ఆయనే గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి. ఇక మూమూలుగా ఉంటుందా కథ?

మరోసారి ఒడిషాలో బీజేడీ ప్రభుత్వమే రాబోతుందని సర్వేలు తేటతెల్లం చేశాయి. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఒడిషా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ బీజేడీనే అధికారంలోకి రాబోతుందంటే.. పోటీ మామూలుగా ఉంటుందా? అందుకే పోటీదారుల లిస్టు చాంతడంతా ఉంది. ఎమ్మెల్యే కావాలనో.. ఎంపీ కావాలనో ఎవరికి ఆశ ఉండదు. అందుకే ఈసారైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశావాహులంతా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు ఈ లిస్ట్ ప్రస్తుతానికి 10 వేల వరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఉన్న సీట్లేమో 147 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాలున్నాయి. దరఖాస్తుదారులేమో 10 వేల మంది ఉన్నారు. మరీ బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్.. ఇంత మందిలో ఎంతమందిని ఫిల్టర్ చేసి రేసులోకి తీసుకొస్తారో చూడాలి.

రానున్న ఎన్నికల్లో ఎంతో మంది నిపుణులతో సహా 10 వేల మందికి పైగా బీజేడీ టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్నారని బీజేడీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి ప్రణబ్‌ ప్రకాశ్‌ దాస్‌ తెలిపారు. ఆరోసారి కూడా సీఎంగా నవీన్‌ పట్నాయక్‌ కొనసాగాలని ఒడిశా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని బలంగా నమ్ముతున్నామని ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

నవీన్ పట్నాయక్ మే 5, 2000 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంటే ఇప్పటి వరకూ ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠం మీద నిరంతరాయంగా కూర్చున్నారు. మరోసారి గెలిస్తే హిస్టరీ సృష్టించినట్టే.

Exit mobile version