Site icon NTV Telugu

Moinabad Drugs Case: అభిషేక్‌ దొరికితే చిక్కుముడి వీడినట్లేనా? ఫ్రెండ్స్‌తో ఏం చేస్తున్నాడు?

Moinabad Drugs Case

Moinabad Drugs Case

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌, కాల్పుల కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మను కస్టడీలోకి తీసుకుంది సిట్‌. మరోవైపు డ్రగ్స్‌ను సరఫరా చేసిన అభిషక్‌ సింగ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి అభిషేక్‌ను పట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అభిషేక్‌ పోలీసులకు చిక్కితే ఈ కేసులో సిట్‌ మరింత లోతుగా దర్యాప్తు చేయనుంది.

మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మార్చి 14న రాత్రి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌‌పై మొయినాబాద్‌ పోలీసులు, ఈగల్‌ టీమ్‌ దాడులు చేసింది. ఈ క్రమంలో పోలీసులపై పార్టీలో పాల్గొన్న 11 మందిలో.. నమిత్‌ శర్మ 4 రౌండ్లు కాల్పులు జరిపాడు.. సోదాల సందర్భంగా, రోహిత్‌రెడ్డి డ్రైవర్‌ శరత్‌కుమార్‌ దగ్గర కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులపై కాల్పులు జరిపిన నమిత్‌‌ శర్మతో పాటు పైలెట్‌ రోహిత్‌ రెడ్డి అతని సోదరుడు రితేశ్‌రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఏడుగురిని సిట్‌ బృందం విచారించింది. ఈ కేసులో డ్రగ్స్‌ సిమ్లా నుంచి తీసుకువచ్చానని నమిత్‌శర్మ చెప్పగా.. విచారణలో మాత్రం హైదరాబాద్‌లోనే కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో తెరపైకి కొత్తగా అభిషేక్‌ సింగ్‌ పేరు వచ్చింది. అభిషేక్‌ దగ్గరనే కొకైన్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించింది సిట్‌ బృందం.

డ్రగ్‌ పెడ్లర్‌లైన రాకేశ్‌, అభిషేక్‌ల పేర్లు విచరాణలో వెలుగులోకి వచ్చాయి. దీంతో ఫాంహౌస్‌లో ఇప్పటి వరకు ఎన్ని సార్లు పార్టీలు జరిగాయి..? ఒకవేళ ఆ పార్టీలో డ్రగ్స్‌ వినియోగిస్తే.. ఆ డ్రగ్స్‌‌ను సరఫరా ఎవరు చేశారన్న అంశంపై సిట్‌ దర్యాప్తు చేసింది. దీంతో ఈ కేసులో రాకేశ్‌తో పాటు అభిషేక్‌ కీలకంగా మారాడు. దీంతో ప్రస్తుతం పరారీలో ఉన్న అభిషేక్ కోసం సిట్ బృందం గాలింపు ప్రారంభించింది.

రాజేంద్రనగర్‌లోని భవానీ నగర్‌కు చెందిన అభిషేక్‌, ఇంటరీయర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని వద్దే పలుమార్లు డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు సిట్‌ భావిస్తోంది. అందుకోసమే, అభిషేక్‌ సింగ్‌ జాడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు సిట్‌ టీమ్. ఈ క్రమంలో మార్చి 17 నుంచి అభిషేక్‌ కనిపించకుండా పోయాడంటూ అతని తండ్రి రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లిమిట్స్‌‌లో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. మార్చి 16న రాత్రి ఇంట్లోనే ఉన్న అభిషేక్‌.. 17న ఉదయం నుంచి కనిపించడం లేదని.. ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లిన తిరిగి ఇంటికి వస్తాడని చూశామని చెబుతున్నాడు తండ్రి. అలాగే ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తుందని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఫాంహౌస్‌ కేసులో డ్రగ్స్‌కు సంబంధించిన గుట్టు వీడాలంటే సిట్‌ బృందానికి అభిషేక్‌ సింగ్‌ చిక్కడం కీలకంగా మారనుంది. అందుకోసమే అతని జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అభిషేక్‌తో పాటు మరో పెడ్లర్‌ రాకేశ్‌ కోసం గాలిస్తున్నాయి పోలీస్‌ టీమ్‌లు. రోహిత్‌ రెడ్డికి అభిషేక్‌కు డ్రగ్స్ అంశంలో లావాదేవీలు ఉన్నట్లుగా సిట్‌ నిర్థారణకు వచ్చింది. ఈ వ్యవహారం పూర్తిగా వెలుగులోకి రావాలంటే అభిషేక్‌ సింగ్ దొరకడం చాలా కీలకమని సిట్‌ భావిస్తోంది. ప్రస్తుతం రోహిత్‌ రెడ్డి కోర్టు అనుమతితో కస్టడీలో ఉన్నారు. ఆయన కస్టడీ గడువు ముగిసే లోపు అభిషేక్‌ చిక్కితే.. ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాలని సిట్ భావిస్తోంది.

Exit mobile version