NTV Telugu Site icon

Mohammed Siraj Records: ఆసియా కప్ ఫైనల్‌లో 6 వికెట్స్.. 10 రికార్డులు సృష్టించిన మహ్మద్ సిరాజ్!

Mohammed Siraj Jumps

Mohammed Siraj Jumps

Here Is Mohammed Siraj’s Records after Taking 6 Wickets in Asia Cup 2023 Final: కొలంబో వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్‌లో భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. పటిష్ట శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేయడంలో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఒకే ఓవర్లో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4 వికెట్స్ పడగొట్టి లంక నడ్డి విడిచాడు. ఇక ఫైనల్‌ మ్యాచ్‌లో మొత్తంగా 7 ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ తాను తీసిన 6 వికెట్లతో 10 రికార్డులు సృష్టించాడు. అవేంటో ఓసారి చూద్దాం.

# వన్డేల్లో ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌ మహ్మద్ సిరాజ్‌. శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్‌ 2003లో బంగ్లాదేశ్‌పై 4 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్తాన్ మాజీ పేసర్ మొహమ్మద్‌ సమీ 2003లో న్యూజిలాండ్‌పై 4 వికెట్స్ తీయగా.. ఇంగ్లండ్‌ స్పిన్నర్ ఆదిల్‌ రషీద్‌ 2019లో వెస్టిండీస్‌పై ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

# వన్డేల్లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్ మహ్మద్ సిరాజ్‌ కావడం విశేషం. లంక మాజీ బౌలర్ లసిత్ మలింగ 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై ఒకే ఓవర్‌లో 4 వికెట్స్ తీశాడు.

# ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌తో అత్యంత వేగంగా 5 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మహ్మద్ సిరాజ్ రికార్డు సృష్టించాడు.

# శ్రీలంకపై 16 బంతుల్లో 5 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్.. లంక మాజీ పేసర్ చమిందా వాస్ రికార్డ్‌ను సమం చేశాడు. 2003లో బంగ్లాదేశ్‌పై వాస్ 16 బంతుల్లోనే 5 వికెట్ల‌ను తీశాడు.

# వన్డేల్లో భారత్‌ తరఫున ఇది (6/21) నాలుగో అత్యుత్తమ ప్రదర్శన. స్టువర్ట్‌ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12), జస్ప్రీత్ బుమ్రా (6/19) సిరాజ్‌ కంటే ముందున్నారు.

# ఆసియా కప్ చరిత్రలో 6 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా సిరాజ్ రికార్డ్ సృష్టించాడు. 2008లో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ 6 వికెట్స్ పడగొట్టాడు.

Also Read: Mohammad Siraj: నాకు ఓ మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్‌తో 7 ఓవర్లే వేయించా: రోహిత్ శర్మ

# వన్డే క్రికెట్‌లో 50 కంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో సిరాజ్‌ చేరాడు. సిరాజ్ 29 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

# అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో (1002) 50 వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. శ్రీలంక మాజీ క్రికెటర్ అజంతా మెండిస్ (847 బంతుల్లో) అగ్రస్థానంలో ఉన్నాడు.

# ఆసియా కప్ ఫైనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆశిష్ నెహ్రా పేరిట ఉన్న రికార్డ్‌ను సిరాజ్ సమం చేశాడు. మూడు ఫైనల్స్ ఆడిన నెహ్రా 6 వికెట్లు తీయగా.. ఒకే ఒక్క ఆసియా కప్ ఫైనల్‌ ఆడిన సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు.

# వన్డే క్రికెట్‌ ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా, ప్రపంచంలో 3వ బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్‌ బౌలర్ అఖిబ్ జావేద్ (7/37) అగ్రస్థానంలో ఉన్నాడు.

# పాకిస్తాన్ మాజీ బౌలర్ వకార్ యూనిస్ రికార్డును సిరాజ్ బద్దలు కొట్టాడు. 1990లో వకార్ 26 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 21 పరుగులకే 6 వికెట్లు తీశాడు.