Site icon NTV Telugu

Mohammed Siraj Injury: మొహ్మద్ సిరాజ్‌కు గాయం.. భారత్-న్యూజీలాండ్ సెమీఫైనల్‌లో ఆడుతాడా?

Mohammed Siraj Injury

Mohammed Siraj Injury

Mohammed Siraj Injury Scare For Team India: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియాకు కీలక సెమీఫైనల్‌కు ముందు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మొహ్మద్ సిరాజ్‌కు గాయం అయింది. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిరాజ్‌ గాయపడ్డాడు. క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించగా.. బంతి నేరుగా సిరాజ్ గొంతుపై పడింది. ఇదే ఇప్పుడు భారత అభిమానులను భయాందోళనకు గురిచేస్తోంది. భారత్-న్యూజీలాండ్ సెమీఫైనల్‌లో సిరాజ్ ఆడుతాడా? లేదా? అని చర్చిస్తున్నారు.

15వ ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ చేయగా.. మొహ్మద్ సిరాజ్ లాంగ్ ఆన్‌లో ఉన్నాడు. కుల్దీప్ వేసిన నాలుగో బంతిని నెదర్లాండ్స్‌ ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ భారీ షాట్ ఆడాడు. బాగా ఎత్తుగా గాల్లోకి లేచిన బంతిని అందుకోవడానికి సిరాజ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. బంతిని సిరాజ్ సరిగా అంచనా వేయలేకపోయ్యాడు. చేతుల్లోంచి జారిన బంతి నేరుగా వచ్చి అతని గొంతుపై పడింది. దీంతో చాలా ఇబ్బంది పడిన సిరాజ్.. మైదానం వీడాడు. బౌండరీ లైన్ ఆవల చాలాసేపు ఫిజియోతో చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చి సిరాజ్ బౌలింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: BiG Breaking: నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిదిమంది సజీవ దహనం

మొహ్మద్ సిరాజ్ గాయంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఒకవేళ గాయం తీవ్రమైనది అయితే.. టీమిండియాకు ఇది భారీ దెబ్బ అవుతుంది. బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో భారత్ సెమీఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ సమయానికల్లా సిరాజ్ పూర్తిగా కోలుకుంటే.. ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం టీమిండియా బౌలింగ్ విభాగానికి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. మెగా టోర్నీలో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version