NTV Telugu Site icon

Mohammed Shami: ప్రధాని పరామర్శ తర్వాతే.. ఒకరితో మరొకరం మాట్లాడుకున్నాం!

Shami Modi

Shami Modi

Mohammed Shami hails PM Modi for dressing room visit: సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడంతో యావత్ భారతావని నిరుత్సాహానికి గురైన సంగతి తెలిసిందే. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి తుది మెట్టుపై బోల్తా పడడంతో భారత్ ఫాన్స్ సహా ఆటగాళ్లు కూడా ఏడ్చేశారు. మైదానంలోనే ప్లేయర్స్ ఏం మాట్లాడకుండా ఉండిపోయారు. ఓటమి బాధలో డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లాక కూడా భారత ప్లేయర్స్ ఒకరితో మరొకరు మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని తాజాగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చి పరామర్శించి, ధైర్యం చెప్పారని షమీ చెప్పాడు.

ప్రధాని మాటలు తమకు ఎంతో ప్రేరణగా నిలిచాయని మహమ్మద్ షమీ వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షమీ.. ఫైనల్ నాటి క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. ‘ఫైనల్ ఓటమి బాధతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో అందరం అలా కూర్చుండిపోయాం. దాదాపు రెండు నెలల పాటు పడిన శ్రమ ఒక్క మ్యాచ్‌తో నిరుపయోగంగా మారింది. ఆ రోజు మాకు అస్సలు కలిసిరాలేదు. ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి రావడంతో.. మేమంతా ఆశ్చర్యపోయాం. అసలు ప్రధాని మా వద్దకు వస్తారన్న సమాచారం మాకు లేదు. అందుకే ప్లేయర్స్ అందరూ ఆశ్చర్యపోయారు’ అని షమీ తెలిపాడు.

Also Read: AUS vs PAK: టెస్టులో టీ20 ఇన్నింగ్స్‌.. డేవిడ్ వార్నర్‌ సెంచరీ!

‘ఆ సమయంలో మేం ఎవరితోనూ మాట్లాడే స్థితిలో లేము. ఏమీ తినాలని కూడా అనిపించలేదు. ప్రధాని మోదీని డ్రెస్సింగ్‌ రూమ్‌లో చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. ప్రధాని ఒక్కొక్కరితో మాట్లాడారు. బాగా ఆడారని మెచ్చుకుని ధైర్యం చెప్పారు. ఆ తర్వాత అందరం ఒకరితో మరొకరం మాట్లాడుకున్నాం. ఈ ఓటమి బాధ నుంచి బయటపడి ముందుకు సాగాలని భావించాం. ప్రధాని పరామర్శ మాకు ఎంతో ఉపయోగపడింది’ అని మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. షమీని అప్యాయంగా కౌగిలించుకుని ప్రధాని ధైర్యం చెప్పిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.