Modi – Putin: రష్యా అధినేత పుతిన్ జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రపంచ దేశాల అధినేతలు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈసందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆయనకు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుతిన్ ఆరోగ్యం బాగుండాలని, ఆయన అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ ఫోన్ కాల్ సంభాషణలో భారతదేశం – రష్యా ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు తమ నిబద్ధతను ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు.
పుతిన్‌ను ఆహ్వానించిన మోడీ..
23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి భారతదేశానికి రావాలని ప్రధానమంత్రి మోడీ పుతిన్‌ను ఆహ్వానించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక ఎజెండాలో పురోగతిని సమీక్షించారు. అలాగే ఇరుదేశాల పరస్పర సహకారాన్ని కొత్త శిఖరాలకు పెంచడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. భారతదేశం – రష్యా మధ్య సంబంధాలు చాలా కాలంగా బలంగా ఉన్నాయి. రక్షణ, ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి వంటి రంగాలలో లోతైన సహకారంతో ఇరు దేశాలు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
2024 జూలైలో 22వ ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశం, సెప్టెంబర్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని మోదీ రెండుసార్లు రష్యాను సందర్శించారు. ఈ సమావేశాల్లో రక్షణ ఒప్పందాలు, అణుశక్తి, ప్రాంతీయ స్థిరత్వం ఇరు దేశాల అగ్రనాయకులు చర్చించారు. తాజా ఫోన్ కాల్‌లో ఇద్దరు నాయకులు అన్ని రంగాలలో ఇరుదేశాల సహకారాన్ని విస్తరించడాన్ని నొక్కి చెప్పారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.
READ ALSO: Keir Starmer India Visit 2025: రేపటి నుంచి భారత్‌లో బ్రిటన్ ప్రధాని పర్యటన.. ఎందుకో తెలుసా!
