Site icon NTV Telugu

Modi Xi Jinping Meeting: రష్యా, చైనా అధ్యక్షులను కలవనున్న మోడీ.. టియాంజిన్ చేరుకున్న ప్రధాని

Sco Summit

Sco Summit

Modi Xi Jinping Meeting: భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముగించుకుని చైనా చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం మోడీ చైనాలోని టియాంజిన్ నగరానికి చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ప్రధాని మోదీ విమానం దిగినప్పుడు, ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి చైనాకు చెందిన పలువురు సీనియర్ దౌత్యవేత్తలు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు అనేక మంది చైనా మహిళా కళాకారులు నృత్యం చేస్తూ కనిపించారు. చైనా చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ Xలో ఒక పోస్ట్‌ చేశారు. చైనీస్ భాషలో .. ‘షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా వివిధ దేశాల నాయకులతో చర్చలు, సమావేశాల కోసం ఎదురు చూస్తూ చైనాలోని టియాంజిన్ చేరుకున్నాను’ అని పోస్ట్‌ చేశారు. 7 ఏళ్ల తర్వాత భారత ప్రధాని చైనా పర్యటనకు వచ్చారు. ఈసందర్భంగా ఆయన ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలో జరిగే SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో 20 కి పైగా దేశాల నాయకులు పాల్గొననున్నారు. సమావేశం అనంతరం మోడీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను కలుస్తారు.

READ ALSO: Reliance: వచ్చే ఏడాది 52000 కోట్ల IPO రావచ్చు

2017 నుంచి SCOలో భారతదేశం..
భారతదేశం 2017 నుంచి SCOలో సభ్యదేశంగా ఉంది. ఈక్రమంలో భారత్ 2022-23లో సంస్థ అధ్యక్ష పదవిని కూడా చేపట్టింది. “భారతదేశం SCOలో చురుకైన, నిర్మాణాత్మక సభ్యదేశం. మా అధ్యక్షతన, ఆవిష్కరణ, ఆరోగ్యం, సాంస్కృతిక మార్పిడి రంగంలో కొత్త ఆలోచనలను అందించాము. ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి, ప్రాంతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి SCO సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది” అని ప్రధాని మోదీ అన్నారు. “జపాన్, చైనాలకు తన పర్యటనలు భారత జాతీయ ప్రయోజనాలు, ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి, ప్రాంతీయ, ప్రపంచ శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ధిలో సహకారాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయని తాను విశ్వసిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

SCO సభ్య దేశాలు
SCO అనేది శాశ్వత అంతర్ ప్రభుత్వ అంతర్జాతీయ సంస్థ. దీనిని 15 జూన్ 2001న షాంఘైలో స్థాపించారు. దీని సభ్య దేశాలలో చైనా, రష్యా, భారతదేశం, కజకిస్థాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్థాన్, పాకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఇరాన్, బెలారస్ ఉన్నాయి. SCO కి ఆఫ్ఘనిస్థాన్, మంగోలియా దేశాలు పరిశీలకులు ఉండగా, టర్కీ, కువైట్, అజర్‌బైజాన్, అర్మేనియా, కంబోడియా, నేపాల్ సహా 14 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. శ్రీలంక, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్, బహ్రెయిన్, మాల్దీవులు, మయన్మార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా SCO కి భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.

గతంలో భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ 2024లో రష్యాలోని కజాన్‌లో, 2023లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో సమావేశమైన విషయం తెలిసిందే. గత వారం చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి సరిహద్దు వ్యవహారాలపై ప్రత్యేక ప్రతినిధుల 24వ సమావేశంలో పాల్గొనడానికి భారతదేశాన్ని సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

READ ALSO: Joseph Rajesh Success Story: ఉద్యోగాన్ని వదిలేసి టీ కొట్టు పెట్టాడు.. కట్ చేస్తే కోట్లకు అధిపతి

Exit mobile version