Site icon NTV Telugu

MLC Mahesh Kumar Goud : బీజేపీ గుండాల దాడిని సభ్యసమాజం తీవ్రంగా ఖండించాలి

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు భారత్ జొడో న్యాయ యాత్ర చేస్తున్న సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన తో బెంబేలెత్తిపోయిన బీజేపీ గుండాలు అస్సాం లోని సోనిత్ పూర్ జిల్లాలో దాడికి పాల్పడ్డారు. బీజేపీ కార్యకర్తలు గుండాలు చేసిన దాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌. రాహుల్ గాంధీ పైన జరిగిన దాడి ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడి, ఈ దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలన్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. బషీర్ బాగ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారు. కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ జోడో యాత్రను బీజేపీ పార్టీ నాయకులు అడ్డుకొని కార్యకర్తలపై దాడి చేయడాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పబ్లిక్ గార్డెన్ వరకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపడుతున్న యాత్రకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక బిజెపి నాయకులు అడ్డుకుంటున్నారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ పార్టీ అంటేనే మతాల మధ్య చిచ్చు పెడుతుందని, భక్తి ముసుగులో బిజెపి పార్టీ ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. రాముడు బీజేపీ పార్టీకే దేవుడు కాదు.. అందరికీ దేవుడే అని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని ప్రజలు తరిమి కొడతారన్నారు.

Exit mobile version