MLC Jeevan Reddy Fires on komatireddy rajgopal Reddy
తెలంగాణ రాజకీయం మొత్తం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలకు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే.. తాజాగా మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. వీఆర్‌ఏల సమస్య వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్‌వోల రద్దు తరవాత.. వీఆర్‌ఏ ప్రమోషన్ ఛానల్ క్లోజ్ అయ్యిందని, మహిళ ఉద్యోగులకు కనీసం ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. వీఆర్‌ఏల సమస్య పరిష్కారంకి ప్రభుత్వం కనీస చొరవ తీసుకోవడం లేదని, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఎందుకు స్పందించడం లేదన్నారు. మీ ఇంట్లో సేవలు చేయడానికి వీఆర్‌ఏలు కావాలని.. కానీ.. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే మాత్రం పట్టించుకోరా..? అని ఆయన ప్రశ్నించారు.
మునుగోడు సమస్యలు పరిష్కారం చేసే అవకాశాన్ని కూడా రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదని, శివన్నగూడెం రైతుల కోసం కనీసం ధర్నా చేశావా..? పరిహారం కోసం నిరాహార దీక్ష అయినా చేశావా..? ఆయన బాధ్యతరహిత్యం.. మళ్ళీ గెలిచినా ఎమ్మెల్యే అయినా వచ్చేది ఏముందని ఆయన అన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి అహంకారంతో వచ్చిన ఎన్నిక ఇది అని ఆయన ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ అధికార మదంతో ఎన్నికలను గెలవాలని చూస్తుందని, రాజగోపాల్ రెడ్డి వ్యవహారం సొంత ఇంటికి కన్నం వేసినట్టు ఉందని, మునుగోడు ప్రజలు విజ్ఞులు.. టీఆర్‌ఎస్, బీజేపీ ఓటుకు పది వేలు ఇవ్వడానికి సిద్ధం అయ్యాయని ఆయన విమర్శించారు.