NTV Telugu Site icon

Telangana MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలంటే..

Mlc

Mlc

Telangana MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడంలో కొన్ని ముఖ్యమైన నియమాలను అనుసరించాలి. ముఖ్యంగా విద్యావంతులైన ఓటర్లే అధికంగా పాల్గొనే ఈ ఎన్నికల్లో గతంలో పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఇది ఓటింగ్ విధానంపై అవగాహన లోపాన్ని స్పష్టం చేస్తోంది. అందుకే ఈసారి ఓటర్లు తమ ఓటు విలువైనదిగా మార్చుకోవడానికి కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరం ఉంది. మరి ఓటు వేయడంలో పాటించాల్సిన నియమాలు చూద్దాం.

Read Also: MLC Elections: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. నేడే పోలింగ్

* బ్యాలెట్ పేపర్, పెన్ను ఉపయోగం:

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాలి. అయితే, ఓటు వేసే సమయంలో తప్పనిసరిగా పోలింగ్ అధికారులిచ్చే ఊదా (వాయిలెట్) రంగు స్కెచ్ పెన్నుతోనే ఓటు వేయాలి. ఇతర పెన్నులు, పెన్సిళ్లు ఉపయోగిస్తే ఆ ఓటు చెల్లదు.

* టిక్ మార్క్, ఇతర గుర్తులు వద్ద:

ఓటు వేస్తున్నప్పుడు టిక్ మార్క్ (✔), ఓకే (OK) అనే పదాలు, ఇతర గుర్తులు చేయకూడదు. కేవలం అంకెలను మాత్రమే ఉపయోగించాలి.

* ప్రాధాన్యతా ఓటు విధానం:

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు ఒకరికి కాకుండా అనేక అభ్యర్థులకు ప్రాధాన్యతా ఓటు వేయవచ్చు. అయితే, తప్పనిసరిగా ఓటరు ఎవరికైనా 1 (మొదటి ప్రాధాన్యత) అంకె వేయాలి. మొదటి ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకెను వేయాలి. 1 అంకె వేయకుండా 2, 3, 4 అంకెలను నేరుగా వేయకూడదు. కచ్చితంగా 1 అంకెను ఎవరికైనా ఇవ్వాలి. మిగతా అభ్యర్థులకు 2, 3, 4 ఇలా వరుస సంఖ్యలుగా ప్రాధాన్యత ఇవ్వొచ్చు.

Read Also: Assam Earthquake: అస్సాంలో భూ ప్రకంపనలు!

* ఒకే అంకెను ఒక్కరికే:

ఓటరు ఒక అభ్యర్థికి ఒకే ప్రాధాన్య సంఖ్యను మాత్రమే ఇవ్వాలి. అదే అంకెను ఇద్దరు లేదా ముగ్గురికి వేస్తే ఆ ఓటు చెల్లదు.

* అంకెల లిఖన పద్ధతి:

ఓటరు భారతీయ అంకెలైన 1, 2, 3, 4, 5 లేదా రోమన్ అంకెలు I, II, III, IV, V వంటి సంఖ్యలను మాత్రమే ఉపయోగించాలి. ఆంగ్ల అక్షరాలతో “One”, “Two” అని రాసినా, లేదా “OK”, “Yes” వంటి పదాలు రాసినా ఆ ఓటు చెల్లనిది.

* ఇతర వివరాలు రాయడం తప్పు:

బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థి పేరు పక్కన ఓటరు తన పేరు, సంతకం, ఇతర రకాల గుర్తులు పెట్టకూడదు. ఓటు వేయాల్సిన గడిని దాటి వేరే చోట అంకె రాస్తే అది చెల్లదు. అభ్యర్థి పేరుపై టిక్ చేయడం, వరుస సంఖ్యలపై మార్క్ వేయడం కూడా చేయకూడదు.

గత ఎన్నికల్లో ఓటింగ్ విధానం సరిగ్గా పాటించకపోవడం వల్ల చాలామంది ఓట్లు చెల్లనివిగా మారాయి. కాబట్టి ఈసారి ఓటర్లు పై విధంగా నిర్దేశించిన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఒక్క చిన్న తప్పిదం ఓటు చెల్లని ఓటుగా మారే ప్రమాదం ఉంది. ప్రతి ఓటు కీలకమైనది కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలి.