MLA Kotamreddy Sridhar Reddy Murder Plan Video: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేయాలని ఐదుగురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేసిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న సంచలన వీడియో వైరల్‌గా మారింది. మర్డర్ మాస్టర్ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నట్లు తెలుస్తోంది.
పూటుగా మద్యం సేవించి.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య ప్లాన్ గురించి రౌడీషీటర్లు జగదీష్, మహేష్, వినీత్‌తో పాటు మరో ఇద్దరు చర్చిస్తున్నట్లు సదరు వీడియోలో కనిపిస్తోంది. ఎమ్మెల్యేను చంపేయాలని అయిదుగురు రౌడీషీటర్లు మందు తాగుతూ మాస్టర్ ప్లాన్ వేశారు. గదిలో మొత్తంగా ఏడుగురు ఉన్నారు. అందులోని ఒకరే వీడియో తీయగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మాస్టర్ ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ హస్తం ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
Also Read: AP Liquor Scam: నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు.. అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ..!
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందని సైతం టీడీపీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. వీడియో వ్యవహారం తన దృష్టిలో వచ్చిందని నెల్లూరు ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. విచారణ జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఐదు రోజుల కిందట విషయం పోలీసులకు తెలిసిందని, ఇంతవరకూ వారు స్పందించలేదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.