Miss World Pageant 2024 in India: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ‘మిస్ వరల్డ్’ పోటీలు భారత్‌లో జరగనున్నాయి. 71వ మిస్ వరల్డ్ పోటీలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఢిల్లీ మరియు ముంబై నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్‌లో చివరిసారిగా 1996లో ఈ పోటీలు నిర్వహించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని అశోక్ హోటల్‌లో 71వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ కోసం ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ప్రస్తుత మిస్ వరల్డ్ సహా నలుగురు మాజీ విజేతలు హాజరయ్యారు.
ప్రస్తుత ప్రపంచ సుందరి కరోలినా బిలాస్కా (పోలెండ్)తో పాటు మాజీ విజేతలు తోని అన్ సింగ్ (జమైకా), వనెస్సా పోన్సీ డి లియోన్ (మెక్సికో), మానుషీ చిల్లర్ (భారత్), స్టిఫేనీ డెల్ వాలీ (ప్యూర్టో రికో)లు 71వ మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ మరియు సీఈఓ జూలియా మోర్లీ మాట్లాడుతూ… ‘భారతదేశం పట్ల నాకున్న ప్రేమ అమితమైంది. 71వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌ను ఇక్కడ నిర్వహించడం నాకు చాలా ప్రత్యేకం. భారత్ ఒక అందమైన దేశం. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20న ఢిల్లీలో ‘ది ఓపెనింగ్ సెర్మనీ’, ‘ఇండియా వెల్‌కమ్స్ ది వరల్డ్ గాలా’ కార్యక్రమాలతో మిస్ వరల్డ్ పోటీలు మొదలవనున్నాయి. మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఫైనల్స్ జరగనున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 120 మంది సుందరీమణులు ఈ పోటీలో పాల్గొననున్నారు. 1951లో మిస్ వరల్డ్ పోటీలు ఆరంభం అయ్యాయి.