Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా ‘జెన్నిఫర్ బారెటో’..!

Jennifer Barreto Miss Universe 2026

Jennifer Barreto Miss Universe 2026

Miss Universe 2026 Winner Jennifer Barreto: మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో నిలిచారు. 75వ మిస్ యూనివర్స్ పోటీల గ్రాండ్ ఫినాలేలో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మెక్సికోకు చెందిన ప్రస్తుత మిస్ యూనివర్స్ ఫాతిమా బోష్.. జెన్నిఫర్‌కు కిరీటాన్ని అలంకరించారు. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నూనెజ్ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ గోయెట్జ్ రెండో రన్నరప్‌గా నిలిచారు.

ప్యూర్టోరికోలోని శాన్ జువాన్‌లో ఉన్న జోస్ మిగ్యుయెల్ అగ్రెలోట్ కొలీజియంలో ఈ పోటీలు జరిగాయి. 75 ఏళ్ల మిస్ యూనివర్స్ చరిత్రలో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో 116 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. నేషనల్ కాస్ట్యూమ్, ప్రిలిమినరీ, ఫైనల్ రౌండ్లలో పోటీదారులు తమ ప్రతిభను ప్రదర్శించగా.. టాప్‌-5లో ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్, వెనిజులా, డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టోరికో దేశాల భామలు నిలిచారు.

చివరి రౌండ్‌లో పోటీదారులందరికీ ఒకే ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత ప్రపంచానికి నాయకుల నుంచి అత్యంత అవసరమైనది ఏమిటని అడిగారు. దీనికి జెన్నిఫర్ బారెటో సమాధానమిస్తూ.. నాయకుల్లో వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు ఇతరుల పట్ల సానుభూతి, సహానుభూతి ఉండాలని పేర్కొన్నారు. ఇతరులను విమర్శించడం కంటే తమ విలువలకు కట్టుబడి ఉండి, ఆదర్శంగా నిలుస్తూ ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలని చెప్పారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, వారి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించే నాయకత్వం సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురాగలదని వివరించారు.

ఎవరీ జెన్నిఫర్ బారెటో?

జెన్నిఫర్ బారెటోకు రీసెర్చ్ సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉంది. సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలు కూడా పొందారు. 2021లో అమెరికా రక్షణ శాఖలోని ఫోర్ట్ హుడ్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఫ్యామిలీ అడ్వకసీ ప్రోగ్రామ్‌లో భాగంగా గృహ హింస, పిల్లలపై వేధింపులకు గురైన సైనిక కుటుంబాలకు సహాయం అందించారు. అంతేకాకుండా.. అలాంటి ఘటనలను నివారించడం, బాధితులకు మద్దతు అందించడం వంటి అంశాలపై నాయకులకు శిక్షణ ఇచ్చారు. కార్ల్ ఆర్. డార్నాల్ ఆర్మీ మెడికల్ సెంటర్‌లో స్వచ్ఛంద సేవ కూడా చేశారు.

భారత్‌కు నిరాశ..

ఈ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్న కాజియా లిజ్ మెజో టాప్‌-30 రౌండ్‌కు అర్హత సాధించారు. అయితే, టాప్‌-12లోకి ప్రవేశించలేకపోయారు. దీంతో ఆమె మిస్ యూనివర్స్ కిరీటం రేసు నుంచి నిష్క్రమించారు. జెన్నిఫర్ బారెటో విజయంతో ప్యూర్టోరికోకు మిస్ యూనివర్స్ కిరీటం ఆరోసారి దక్కింది. గతంలో ఆ దేశం నుంచి మారిసోల్ మలారెట్ (1970), డెబోరా కార్తీ-డియో (1985), దయనారా టోరెస్ (1993), డెనిస్ క్వినోన్స్ (2001), జులేకా రివెరా (2006) విశ్వసుందరి టైటిళ్లను గెలుచుకున్నారు. సొంత గడ్డపై ప్యూర్టోరికో ఈ టైటిల్ గెలుచుకోవడం ఇది రెండోసారి.