మునుగోడు ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. అయితే.. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. ప్రజలే టీఆర్ఎస్ బలమని, ప్రజల కోసమే తెలంగాణ తెచ్చుకున్నమన్నారు. బుక్కెడు బువ్వ పెడితే తిన్నమని, జై తెలంగాణ అని ఉద్యమించినం.. తెలంగాణ రాష్ట్రం సాధించినమన్నారు. అంతేకాకుండా.. ‘మునుగోడుకు నీళ్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ శివన్నగూడెం నిర్మిస్తున్నారు. 60 ఏండ్లు మిగతా పార్టీలు ఏం చేశాయి ? నల్లగొండ బిడ్డలకు ఫ్లోరైడ్ విషపు నీళ్లు తాగించారు. ఇక్కడి ప్రజల విషాద జీవనం నాకు తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరధతో విషపు నీళ్లకు విరుగుడు ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మిషన్ భగీరధకు ఒక్క రూపాయి సాయం చేయలేదు.
ఏ మొకం పెట్టుకుని ఓట్ల ఆడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి లభించే పరిస్థితి తీసుకువచ్చాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్న ఒక్క పథకం అమలుకావడం లేదు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. తెలంగాణ ఉద్యమంలో కానరానోళ్లు, రాజీనామా చేయమంటే మొకం చాటేసినోళ్లు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నరు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.