NTV Telugu Site icon

Minister Seethakka : అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి

Seethakka

Seethakka

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అన్నారు. ఉట్నూర్ కొమురంభీం కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ప్రగతిపై ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్ పి.ఎస్. బదావత్ సంతోష్, హేమంత్ బొర్కడే, ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్, ఇంచార్జి ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్త, అదనపు కలెక్టర్లు బి.రాహుల్, దీపక్ తివారి, ఫైజన్ అహ్మద్, ఉమ్మడి జిల్లా అటవీ అధికారులు ప్రశాంత్ బాజీరావు పాటిల్, శివ్ ఆశిష్ సింగ్, నీరజ్ టిబ్రెవాల్, కే.రాంకిష్, ఆదిలాబాద్, బోథ్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్, ఖానాపూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, గడ్డం వినోద్, కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, వెడ్మ బొజ్జు లతో కలిసి ఆమె శాఖలవారిగా సమీక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా అందరు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని మారుమూల గ్రామాలు, తండాలు, విద్యా, వైద్యం, రోడ్లు, రవాణా, నీటిసరఫరా, విద్యుత్ వంటి ఇతరత్రా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందే దిశగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధ్దికి ప్రాధాన్యత అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. గిరిజనుల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన కొమురం భీం, హేమన్ డార్ఫ్,డా. బి.ఆర్.అంబెడ్కర్ ఆశయా సాధనకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాజ్యాంగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలు పొందేలా చైతన్య పరచాలని, ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం (గణతంత్ర దినోత్సవం) వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు.

విద్యారంగ అభివృద్ధిలో భాగంగా 10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని అన్నారు. రానున్న వేసవి దృష్ట్యా మారుమూల గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని, భగీరథ నీటిని ప్రతి గ్రామంలో ప్రతి రోజు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజనుల సంక్షేమం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అంకితభావంతో పని చేయాలని, జవాబుదారీతనంతో వ్యవహరించాలని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు, ఆయకట్టు సాగు, విస్తీర్ణం జిల్లాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్ శాఖల అధికారులు ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలు, శాఖల వారిగా కొనసాగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు.

ఆదిలాబాదు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్రాగునీరు, విద్యుత్, రవాణా వంటి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని అన్నారు.

ఖానాపూర్ శాసన సభ్యులు మాట్లాడుతూ, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. ఆదిలాబాదు శాసన సభ్యులు మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో ఎయిర్ పోర్ట్, ఆదిలాబాదు నుండి ఆర్మూర్ కు వయా నిర్మల్ మీదుగా రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బోథ్ శాసన సభ్యులు మాట్లాడుతూ, బోథ్ నియోజక వర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధికి, కుప్టి ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Show comments