Site icon NTV Telugu

Minister Seethakka : పేదల ప్రభుత్వం ఇది.. వారి సంక్షేమమే లక్ష్యం

Seethakka

Seethakka

Minister Seethakka : ములుగు జిల్లా వెంకటాపూర్‌లో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కళ్లముందుంచుకుని పనిచేస్తుందని స్పష్టం చేశారు. పేదలకు నిత్యం తోడుగా నిలబడే సంకల్పంతోనే ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం అందిస్తే.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు అసహనంతో రెచ్చిపోతున్నారని ఆమె మండిపడ్డారు. పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చూసి వారు ఓర్చలేకపోతున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై అన్యాయం చేసిందని, ముఖ్యంగా భూ వ్యవహారాల్లో పేదలపై వివక్ష చూపిందని ఆమె ఆరోపించారు.

భూములపై జరిగే అక్రమాలను అరికట్టేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, గతంలో ‘ధరణి’ పేరిట ప్రజలను మోసం చేశారని ఆమె వ్యాఖ్యానించారు. మేము తెచ్చిన కొత్త చట్టం ద్వారా భూములు అర్హులైన వారికే చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇది ఒక మంచి లక్ష్యంతో రూపొందించిన చట్టం అని సీతక్క వివరించారు. ఇల్లు లేని వారికి గృహ నిర్మాణం కల్పించాలన్నదే ప్రభుత్వం ముందున్న ముఖ్యమైన లక్ష్యమని, ప్రతి పేద కుటుంబం కుండపోత వర్షాల్లోనూ సురక్షితంగా ఉండేలా ఒక గుడిసె అయినా ఉండాలని అనుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు.

గత ప్రభుత్వంలో వీఆర్వోలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, చివరికి వారినే నిందించారని మంత్రి ఆరోపించారు. “ఇప్పుడు కొత్త చట్టం అమలులో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి” అని ఆమె సూచించారు.

Infinix Note 50s 5G+: స్టైలిష్ డిజైన్.. సూపర్ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల

Exit mobile version