Site icon NTV Telugu

Minister Seethakka: మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష

Seethakka

Seethakka

Minister Seethakka: మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై అధికారుల నుంచి నివేదిక కోరారు. అంగన్వాడి కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. నాణ్యత లేని గుడ్లు, వస్తువులు సరఫరా అయితే వాటిని అంగన్వాడీ కేంద్రాలు తిరస్కరించాలని మంత్రి సూచించారు. లేనిపక్షంలో సంబంధిత అంగన్వాడీ టీచర్లు, స్థానిక అధికారులను బాధ్యుల్ని చేయాల్సి వస్తుందన్నారు. నాసిరకం వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also: Komatireddy: తెలంగాణా వచ్చినా నల్లగొండకు ప్రయోజనం లేదు..

అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల సరఫరా కాంట్రాక్టులను గత ప్రభుత్వం రెండేళ్లకు పొడిగించడం వల్ల కొందరు కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కాంట్రాక్టుల గడువును తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో వస్తువుల క్వాలిటీ చెక్ చేసేందుకు జిల్లాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యతలేని గుడ్లు పంపిణీ చేస్తే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని మంత్రి పేర్కొన్నారు. అందుకే అంగన్వాడి కేంద్రాల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని సూచించారు.

Exit mobile version