Site icon NTV Telugu

Minister Seethakka: సహించేది లేదు.. సోషల్ మీడియా ఘ‌ట‌న‌పై మంత్రి సీత‌క్క ఆగ్రహం

Minister Seethakka

Minister Seethakka

Minister Seethakka: సోష‌ల్ మీడియాలో ఓ చిన్నారి పై కొంద‌రు య‌వ‌కులు జుగుప్సాక‌రమైన‌, అసభ్యక‌రమైన‌ వ్యాఖ్యలు చేసిన ఘ‌ట‌న‌పై పంచాయ‌తీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను స‌హించేది లేద‌ని స్పష్టం చేసారు. చిన్నారుల భ‌ద్రత‌కు త‌మ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంద‌న్న సీత‌క్క, దోషుల‌పై క‌ఠిన‌ చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఇప్పటికే ఈ ఘ‌ట‌న‌పై తెలంగాణ పోలీసులు ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు ముమ్మరం చేశార‌ని మంత్రి తెలిపారు. తండ్రి, చిన్నారి కూతురు మ‌ద్య ఉండే ప్రేమానురాగాల‌పై సోషల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యలు చేసిన నిందితుల‌ను వ‌దిలి పెట్టే ప్రస‌క్తే లేద‌ని హెచ్చరించారు. చౌకైన హాస్యం కోసం కుటుంబ బాంధవ్యాలను, మాన‌వ సంబంధాల‌ను అప‌హ‌స్యం చేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగ ప‌రుస్తున్న అసాంఘిక శ‌క్తుల‌కు అడ్డుకట్ట పడేలా చ‌ట్ట ప‌రంగా క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తున్నామ‌న్నారు మంత్రి సీత‌క్క.

Read Also: Minister Seethakka: మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష

ఒక తండ్రి తన కూతురితోతో సరదాగా వీడియో చేయగా.. దానిపైన కొంతమంది యూట్యూబర్స్ డార్క్‌ కామెడీ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడారు. తండ్రీ కూతుళ్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోక్సో చట్టం కింద ప్రణీత్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా స్పందించారు. చిన్నారులపై ఆన్‌లైన్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Exit mobile version