NTV Telugu Site icon

Minister Seethakka : రేగా కాంతారావును కాంగ్రెస్ గెలిపిస్తే పార్టీ ఫిరాయించింది నిజం కాదా

Seethakka

Seethakka

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావు పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫిరాయింపులను ప్రోత్సహించింది నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. రేగా కాంతారావు ను కాంగ్రెస్ గెలిపిస్తే పార్టీ ఫిరాయించింది నిజం కాదా అని ఆమె అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ ఫిరాయించారని అంటున్న రేరా కాంతారావు చేసింది ఏమిటి… నువ్వు ఫిరాయిస్తే అభివృద్ధి కోసం వేరే వాళ్ళ పై విమర్శలు చేసే అర్హత రేగా కాంతారావు కు లేదని ఆమె అన్నారు. గతంలో బీఆర్ఎస్‌లోకి వెళ్లినప్పుడు అభివృద్ధి కోసం వెళ్లినట్లు చెప్పారని, మరి ఇప్పుడు మా వైపు వచ్చే వారు కూడా అందుకే వస్తున్నట్లు కదా అన్నారు. వారు చేస్తే నీతి… ఇతరులు చేస్తే రోత అవుతుందా? అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు.

రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీ కట్టించిన కార్యాలయానికి బీఆర్ఎస్ కార్యాలయం అని పేరు పెట్టుకున్నారని… అందుకు సిగ్గుండాలని బలరాం నాయక్ మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ ఇంట్లో ఉంటూ బీఆర్ఎస్ బోర్డు పెట్టుకోవడం విడ్డూరమన్నారు. అది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమేనని తెలుసుకోవాలన్నారు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకొని మాట్లాడాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల కోట్ల పైగా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి చేసిన వ్యక్తి బలరాం నాయక్ అని, ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, నుండి నిలబడే వాళ్ళు గత పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా దేశంలో రాబోతుందన్నారు సీతక్క. త్యాగాల కుటుంబం, దేశం కోసం, దేశ ఐక్యత కోసం, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన ప్రజల మనిషి రాహుల్ గాంధీ అని, అన్యాయాన్ని ఎదిరించే పోరాట యోధుడైన రాహుల్ గాంధీని ప్రధాని చేసి బడుగు బలహీనులను కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే మహబూబాబాద్ పార్లమెంటు ఎంపీ గా బలరాం నాయక్ ని గెలిపించుకోవాలన్నారు.