Site icon NTV Telugu

Husnabad: ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Husnabad

Husnabad

Husnabad: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువు కట్టపై జరుగుతున్న సుందరీకరణ పనులను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. చెరువును పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వం దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోరాటయోధులతో కూడినదని, ప్రజాస్వామిక పరిపాలనకు పునాదులు వేసిన పార్టీగా అవినీతికి దూరంగా కొనసాగిందని ఆయన అన్నారు. వారి చేతుల్లో అధికారముండి కూడా వారు అవినీతికి పాల్పడకుండా దేశం కోసం త్యాగాలు చేశారని మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుతం గాంధీ కుటుంబంపై జరుగుతున్న వేధింపులు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనని మంత్రి విమర్శించారు. దేశాభివృద్ధి కోసం త్యాగం చేసిన కుటుంబాన్ని, నరేంద్ర మోడీ కక్ష సాధింపు ధోరణితో వేధిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక.. కాంగ్రెస్ బలపడే సమయంలో బీజేపీ పార్టీ ఈడీ, సీబీఐలపై ఆధారపడుతుందని ఆయన అన్నారు. బీజేపీ పార్టీ మిత్రపక్షాలు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా ఉండటం, రాజకీయ ప్రత్యర్థులను మాత్రం లక్ష్యంగా చేసుకోవడం సరికాదని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. తప్పకుండా దేశం మొత్తం గాంధీ కుటుంబానికి అండగా ఉంటుందని.. ప్రజలు న్యాయానికి, ధర్మానికి పక్షపాతంగా ఉంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Exit mobile version