Site icon NTV Telugu

Minister Nimmala Ramanaidu: ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో.. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశాడు

Minister Nimmala

Minister Nimmala

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. అబద్దాలకు అభూత కల్పనలకు ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నిజానికి, నిలకడకు, నిబద్ధతకు, నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని కొనియాడారు. మీ అవినీతి కరపత్రికలో ఒక పేజీ అబద్ధాలు అచ్చోసినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మేస్థితిలో లేరు అని చురకలంటించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశాడు అని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020 మే 5వ తేదీ ఆమోదముద్ర వేసింది మీరే. అదే నెల 20వ తేదీ NGT స్టే ఆర్డర్ తెచ్చింది మీరే అని నిమ్మల తెలిపారు.

రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు ఐదేళ్ల తన హయాంలో జగన్ కేటాయించింది కేవలం 2000 కోట్లు మాత్రమేనని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాయలసీమ ప్రాజెక్టులకు 8 వేల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. ఐదేళ్ల హయాంలో మీరు పూర్తి చెయ్యలేని హంద్రీనీవాను మేము ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి చూపించామన్నారు. రాయలసీమ మీద ప్రేమ ఉంటే 5 ఏళ్ల పాలనలో హంద్రీనీవాకు ఒక్క రూపాయి ఖర్చు గాని, ఒక్క తట్ట మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 738 కిలోమీటర్ వరకు, మడకశిర బ్రాంచి 493కి. మీ. అమరాపురం చెరువు వరకు కృష్ణమ్మ నీటిని తీసుకు వెళ్లిన ఘనత చంద్రబాబుదే అని స్పష్టం చేశారు.

శ్రీకృష్ణదేవరాయలు తర్వాత చంద్రబాబు హయాంలోనే రాయలసీమ చెరువులు జలకలతో కలకలాడుతున్నాయి. గోదావరిలో వృధాగా సంవత్సరానికి 3 వేల టీఎంసీలు నీరు, సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతున్న నీటిలో, 200 టీఎంసీలు, వాడుకుంటే వాళ్లకు అభ్యంతరం ఎందుకు? నీళ్లు కావాలా గొడవలు కావాలా అంటే మేము నీళ్లు కావాలంటాం. అందుకే కాళేశ్వరం నుండి నీటిని తెలంగాణకి ఉపయోగించినప్పుడు దిగువన పోలవరం నుండి ఆంధ్రాకు ఉపయోగిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ నేతల వివాదాలు మన రాష్ట్రంలో చొప్పించి, వైసీపీ రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అవివేకం అని మంత్రి నిమ్మల మండిపడ్డారు.

Exit mobile version