NTV Telugu Site icon

Nara Lokesh: చేనేతలను అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి నారా లోకేష్

Nara Lokesh

Nara Lokesh

కూటమి ప్రభుత్వంలో చేనేతలను అన్ని విధాల ఆదుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్ శాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. చేనేత మహిళలకు పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలను పంపిణీ చేశామని తెలిపారు. పీఐడబ్ల్యూఏ చేపడుతున్న కార్యక్రమాలు, నూతన పద్మశాలీ భవన్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి ఆయన ఫోటోలు దిగారు.

మంగళగిరి-విజయవాడ బైపాస్‌లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ( పీఐడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న నూతన పద్మశాలీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశాలీ భవన్‌కు శంకుస్థాపన చేశారు. పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్‌కు పీఐడబ్ల్యూఏ సభ్యులు, కూటమి నేతలు, కార్యకర్తలు మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.

17 ఏళ్ల క్రితం విజయవాడలో ప్రారంభమైన పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాల ద్వారా చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పేద విద్యార్థులు, చేనేత కుటుంబాలకు దాదాపు మూడు కోట్లకు పైగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్ శాల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలిచామన్నారు.