NTV Telugu Site icon

Nara Lokesh: గల్ఫ్ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపిన మంత్రి నారా లోకేష్!

Nara Lokesh Praja Darbar

Nara Lokesh Praja Darbar

రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి అధికారంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ నేటి యువతకు రోల్ మోడల్‌గా నిలిచారు రాష్ట్ర విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్. సమస్య ఎంత పెద్దదైనా, ఎంత జఠిలమైనదైనా తన దృష్టికి వచ్చిన వెనువెంటనే స్పందించడం, పరిష్కారమయ్యే వరకు వెంటపడడటం.. ప్రజాసేవలో మంత్రి లోకేష్ నిబద్ధత, చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. చాలీచాలని ఆదాయాలతో బతుకు భారంగా మారిన కొందరు సగటు జీవులు కష్టాల కడలి నుంచి గట్టేందుకు ఎడారి దేశాలకు వెళ్లి ఏజంట్ల చేతిలో మోసపోగా.. నేనున్నానంటూ వారికి ఆపన్నహస్తం అందించారు. ఏజంట్ల మోసానికి గురై గల్ఫ్‌లో చిక్కుకున్న దాదాపు 20 మందిని స్వస్థలాలకు రప్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.

తాము ఇబ్బందుల్లో ఉన్నామని వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా మెసేజ్ అందిన వెంటనే మంత్రి నారా లోకేష్ మెరుపు వేగంతో స్పందించారు. కేవలం ప్రభుత్వ పరంగానే గాక తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేసే ఎన్ఆర్ఐ టీడీపీ బృందాలను రంగంలోకి దించి ఎడారి కష్టాలనుంచి గట్టెక్కించారు. అక్కడ తాము ఎదుర్కొన్న దుర్భర పరిస్థితులను తలచుకుంటున్న బాధితులు ముగిసిపోయిందనుకున్న తమ జీవితాలకు మంత్రి లోకేష్ ప్రాణం పోశారని మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రజాసేవ చేయాలంటే కేవలం అధికారం మాత్రమే ఉంటే సరిపోదు.. ప్రజల కష్టాలను తన కష్టంగా భావించే మంచి మనసు కూడా ఉండాలని మంత్రి నారా లోకేష్ నిరూపించారు.

‘ఆర్థిక పరిస్థితి బాగోలేక కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కువైట్ వెళ్లాను. కనుచూపు మేరలో ఎటువంటి జనావాసాలు లేని ఎడారి ప్రాంతంలో గుర్రాలు, ఒంటెలు, కుక్కులు వంటి పెంపుడు జంతువులకు ఆహారం, నీరు అందించే పని నాకు ఇచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ షెడ్లలో ఉండటానికి ఎటువంటి కనీస సౌకర్యాలు లేవు. 50 డిగ్రీలకు పైగా మండే ఎండల్లో నీటి కోసం నేను 2 కిమీల దూరం వెళ్లాల్సి వచ్చేది. నాకు సరిగా భోజనం కూడా పెట్టేవారు కాదు. నా భార్య, బిడ్డలు గుర్తొచ్చి కళ్లు కాయలు కాచేలా ఏడ్చేవాడ్ని. అక్కడ నా గోడు వినే నాథుడే లేడు. నా జీవితం ఆ ఎడారిలోనే ముగిసిపోతుందనుకున్నాను. నా కష్టాలను సెల్ ఫోన్‌లో వీడియో తీసి రాష్ట్రంలో ఉన్న నా మిత్రులకు పంపాను. సోషల్ మీడియా ద్వారా నా కష్టాలను తెలుసుకున్న మంత్రి లోకేష్ వెంటనే స్పందించారు. వారి టీమ్ నేను ఉన్న ప్రాంతాన్ని కనుగొన్నారు. ఏజంట్లు నన్ను మోసం చేసిన విషయాన్ని వారికి చెప్పాను. వెంటనే వారు ఎంబసీతో మాట్లాడి నన్ను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేశారు. నన్ను కువైట్ ఎడారి కష్టాల నుంచి బయటకు తెచ్చి పునర్జన్మ నిచ్చిన మంత్రి లోకేష్ గారికి జీవితాంతం రుణపడి ఉంటా’ అని అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంకు చెందిన చింతపర్తి శివ తెలిపారు.

‘ఇక్కడ చాలీచాలని ఆదాయంతో బిడ్డలను పోషించుకునే దారిలేక హౌస్ మెయిడ్ పనికోసం ఏజంట్ ద్వారా ఒమన్ వెళ్లాను. అక్కడకు వెళ్లాక రేయింబవళ్లు పని చేయించే వారు. ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చినా అక్కడ నన్ను పట్టించుకునేవారు లేరు. ఆ సమయంలో బిడ్డలు గుర్తొచ్చి కుమిలికుమిలి ఏడ్చాను. ఏజంట్లు నన్ను మోసం చేసిన విషయాన్ని నా మామ, మరిదిలకు ఫోన్‌లో తెలియపర్చాను. నేను ఫోన్‌లో మాట్లాడుతున్నానని తెలిసి నా పోన్ కూడా లాగేసుకున్నారు. మా కుటుంబసభ్యులు రాజానగరంలో టీడీపీ నాయకుల ద్వారా విషయాన్ని మంత్రి లోకేష్ కు చెప్పారు. వెంటనే ఆయన ఒమన్‌లోని ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులకు చెప్పడంతో వారు నేను ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. తొలుత లక్షరూపాయలు ఇస్తే గానీ నన్ను వెనక్కి పంపనని అక్కడ ఏజంట్ చెప్పారు. తర్వాత ఆ దేశంలోని ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు ఏజంట్స్, ఎంబసీతో మాట్లాడి నన్ను స్వస్థలానికి పంపించారు. ఆ నరకం నుంచి మళ్లీ ఇంటికి రావడానికి మంత్రి లోకేష్ చేసిన సాయం నా జీవితాంతం గుర్తుంటుంది’ అని రాజానగరం మండలంకు చెందిన కొత్తపల్లి ప్రియాంక పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ మేలు జీవితంలో తమకు మర్చిపోలేము అని చిగురుపాటి బేబి, నమిడి ప్రమీల, సరెళ్ళ వీరేంద్ర కుమార్ కూడా చెప్పుకొచ్చారు.

Show comments