టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉన్నత విద్యాసంస్థల్లో హిందీని బోధనా మాధ్యమంగా చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫారసుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని ఐఐటీల వంటి సాంకేతిక, సాంకేతికేతర ఉన్నత విద్యా సంస్థలలో బోధనా మాధ్యమం హిందీతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో వారి సంబంధిత స్థానిక భాషగా ఉండాలని పార్లమెంటరీ కమిటీ ఇటీవల సిఫార్సు చేసింది. ఇంగ్లీషు వాడకాన్ని ఐచ్ఛికం చేయాలని పేర్కొంది. అయితే.. ప్యానెల్ సిఫారసుకు వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్ ఈరోజు తన అభిప్రాయాలను ట్వీట్ చేశారు.
భారతదేశానికి జాతీయ భాష లేదని, అనేక అధికారిక భాషల్లో హిందీ కూడా ఒకటి అని రాశారు. “ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ రిక్రూట్‌మెంట్లలో హిందీని తప్పనిసరి చేయడం ద్వారా, ఎన్‌డిఎ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది” అని కూడా ఆయన అన్నారు. “భారతీయులకు భాష ఎంపిక ఉండాలి. మేము #హిందీ ఇంపోజిషన్‌కు నో చెప్పాము” అని ఆయన వెల్లడించారు.