పోలీసులు వద్దన్నా సినీ హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు వెళ్లాడని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అయ్యాడన్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదని, ఘటన జరిగిన తర్వాత కనీసం పరామర్శించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. ఏదో జరిగినట్లు అల్లు అర్జున్‌ను పెద్దపెద్ద హీరోలు పరామర్శించడం విడ్డూరంగా ఉందని, చట్టం ముందు అందరూ సమానులే అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ… ‘పోలీసులు వద్దన్నా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లాడు. థియేటర్‌వద్ద తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమయ్యాడు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదు. ఘటన జరిగిన తర్వాత కనీసం పరామర్శించకపోవడం దారుణం. ఏదో జరిగినట్లు అల్లు అర్జున్‌ను పెద్దపెద్ద హీరోలు పరామర్శించడం విడ్డూరంగా ఉంది. చట్టం ముందు అందరూ సమానులే. స్టార్‌లకు ప్రత్యేక మినహాయింపులు ఉండవు. అరెస్టు కోసం ఇంటికి వెళ్లిన పోలీసుల పట్ల అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించాడు. పోలీసులు సహనంతో వ్యవహరించారు’ అని అన్నారు.
‘ఏసీపీ, డీసీపీ చెప్పిన తర్వాతనే థియేటర్ నుండి అల్లు అర్జున్ బయటకి వెళ్ళాడు. ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదు. సభా నాయకుడు, సీఎంకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనను ఎదిరించడం తప్పు. మేం సినీ నటులను గౌరవిస్తాం. మంచి సినిమాలు తీస్తే ప్రోత్సహిస్తాం. సినీ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవు’ అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.