ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు రావద్దని చిక్కడపల్లి ఏసీపీ అల్లు అర్జున్‌కు చెప్పారని, అయినా కూడా ఆయన వినకుండా వచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. పోలీసులు ధియేటర్ నుండి వెళ్లిపోమన్నా కూడా పోలేదని, పుష్ప 2 సినిమా చూసే వెళ్తా అని బన్నీ పట్టుపట్టాడన్నారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమన్నారు. పుష్ప 2 సినిమాకు 2 వేల కోట్ల కలెక్షన్స్ వచ్చాయని, బాధిత కుటుంబానికి రూ.20 కోట్లు ఇస్తే పోయేదేముందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఒక మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి, సూపర్ స్టార్ అయితే ఏంటి అని మండిపడ్డారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… ‘సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రావడానికి అనుమతి లేదు. చిక్కడపల్లి ఏసీపీ రావద్దని చెప్పారు. పోలీసులు ధియేటర్ నుండి వెళ్లిపోమంటే కూడా పోలేదు. సినిమా చూసే వెళ్తా అని అన్నాడు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిపై అల్లు అర్జున్ మాట్లాడటం మంచి పద్ధతి కాదు. యాక్టర్ అయితే.. యాక్టింగ్ చేసుకో.మేం కూడా సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సహకరిస్తాం. సినిమా వారు అడిగారని టికెట్లు రేట్లు పెంచాం. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. హీరో అయినా, ఎమ్మెల్యేలు అయినా చట్టం అందరికీ సమానమే. అల్లు అర్జున్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Also Read: Allu Arjun: అలాంటి వారికి దూరంగా ఉండండి.. ఫాన్స్‌కు అల్లు అర్జున్ రిక్వెస్ట్!
‘పుష్ప 2 సినిమాతో 2 వేల కోట్లు కలెక్షన్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 కోట్లు ఇస్తే పోయేదేముంది. ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారా? అని అడుగుతున్నారు. ఒక మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితేనేంటి, సూపర్ స్టార్ అయితేనేంటి. బాధిత కుటుంబానికి రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. మీరు ఎన్ని వేల కోట్లు పెట్టి సినిమా తీసుకున్నా.. మాకు సంబంధం లేదు. ఇకపై దేశభక్తి, తెలంగాణపై సినిమాలు తీస్తేనే బెనిఫిట్ షోలకు అనుమని ఇస్తాం. సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రిగా చెబుతున్నా.. ఈ విషయంలో ఎవరు చెప్పినా తగ్గేదేలే’ అని మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.