మమ్మల్ని కలవ లేదని ఏరోజూ తెలుగు సినిమా నిర్మాతల్ని తాము ఇబ్బంది పెట్టలేదని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సినీ ప్రముఖులు కలవలేదని తాము ఎప్పుడైనా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా? అని ప్రశ్నించారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ముందు ప్రపంచంలో థియేటర్లో బంధు అనే విషయం ఎందుకు బయటకు వచ్చిందన్నారు. సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది స్పష్టమైన వైఖరి అని పేర్కొన్నారు. సినిమా విషయాలపై పరిజ్ఞానం లేని వారు మాట్లాడుతున్నారని మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు.
ఏపీ రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి, సినీ రంగానికి సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న పలు పరిణామాల గురించి మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. రాజమహేంద్రవరంలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది స్పష్టమైంది. త్వరలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొత్త పాలసీ తీసుకురాబోతున్నాం. సినిమా ఇండస్ట్రీ వారితో చర్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సినిమా పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎంతో సహకరిస్తోంది. కొందరి మాటలు అహంభావపూరితంగా ఉన్నాయి. ప్రతిసారీ ఎవరో ఒకరు టికెట్లు పెంచమని వస్తున్నారు, మేం ఓకే చేస్తున్నాం. ఆ వెంటనే ఎవరో ఒకరు కోర్టుల్లో పిల్ వేస్తున్నారు. అధికారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయినా మేం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం మేం రేట్లు పెంపునకు అనుమతిస్తున్నాం’ అని అన్నారు.
‘తెలుగు సినిమా పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కలుస్తారా లేదా అనేది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాం. మమ్మల్ని కలవలేదని ఏరోజూ తెలుగు సినిమా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేదు. సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి శాశ్వత విధానాన్ని ఏపీ ప్రభుత్వం రూపొందించబోతుంది. హరిహర వీరమల్లు విడుదలకు ముందే బంద్ అనే అంశం ఎందుకు తెరపైకి వచ్చింది. బంద్ అనే విషయం ముందే తెలిసినా ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు స్పందించలేదు. తెలుగు ఫిల్మ్ చాంబర్ ముందుగానే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఏపీ ప్రభుత్వాన్ని కలవాల్సిందని నిర్మాత అల్లు అరవింద్ ఇప్పుడు చెప్పడం హర్షణీయం. ఈ వ్యవహారం నుంచి వైసీపీ లబ్ధి పొందాలని చూస్తుంది’ అని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు.
