తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అయితే.. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు నేతలు. ఈ కార్యక్రమానికి మంత్రులు చెల్లుబోయిన వేణు, జోగి రమేష్, ఎమ్మెల్యే పార్థసారథి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి మాట్లాడుతూ.. స్త్రీలకు సైతం విద్య నేర్పించాలని దేశంలో మొదటి సారి సంకల్పించిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జ్యోతి రావు పూలే ను స్ఫూర్తిగా తీసుకుని అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ చేపడుతున్నారన్నారు. మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ.. బలహీన వర్గాల ప్రజలను విద్య ద్వారా సమాజంలో ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పిన మహానుభావుడు జ్యోతి రావు పూలే అని ఆయన అన్నారు. వందల ఏళ్ళ కిందట వేసిన బీజాలను ముందుకు తీసుకుని వెళుతున్న నాయకుడు జగన్ అని ఆయన ప్రశంసలు కురిపించారు. పూలే ఆలోచనలను ఆ రోజు వైఎస్సార్, ఇవాళ జగన్ ఆచరణలో చూపిస్తున్నారన్నారు మంత్రి జోగి రమేశ్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని, సామాజిక న్యాయ నిర్మాత వైఎస్ జగన్ అని మంత్రి జోగి రమేశ్ అభివర్ణించారు. అభినవ పూలే వైఎస్ జగన్ అని, అడగకుండానే బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తున్న జగన్ కు మనం అందరం అండగా నిలబడాలన్నారు.
Also Read : Rajinikanth: రజనీకాంత్ ‘బాబా’ రీ-రిలీజ్‌కు సన్నాహాలు.. డబ్బింగ్ పూర్తి చేసిన తలైవా
మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ మాట్లాడుతూ.. అంతరాలు తగ్గించటానికి ఏకైక ఔషధం విద్య అని, అటువంటి ఆలోచనా విధానాలు, ఆశయాలను ముందుకు తీసుకుని వెళుతున్న నాయకుడు జగన్ అని ఆయన అన్నారు. అందుకే ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేస్తున్నారని, వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే బలహీన వర్గాల్లోనూ ఉన్నత చదువులు చదవాలన్న ఆకాంక్ష కలిగిందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా వారి కలలను నెరవేర్చుకోగలిగారని, చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ ప్రక్రియకు ఆటంకం కలిగిందని, పూలే ఆశయాల సాధకుడు ముఖ్యమంత్రి జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు.