NTV Telugu Site icon

Minister Harish Rao: మావి న్యూట్రిషన్ పాలిటిక్స్.. వారివి పార్టిషన్ పాలిటిక్స్

Harish Rao

Harish Rao

Minister Harish Rao: తెలంగాణ సర్కార్ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌ పథకం విజయవంతంగా అమలవుతుండగా.. కొత్తగా ‘కేసీఆర్‌ పౌష్టికాహార కిట్ల’ను రూపొందించింది. గర్భిణుల్లో రక్తహీనత అత్యధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో తొలి విడతగా వీటి పంపిణీని ప్రారంభించారు.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నేటి నుంచి కిట్లు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1.25 లక్షల మంది గర్భిణీలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు న్యూట్రిషన్ కిట్​లను పంపిన సర్కారు.. నేడు స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో గర్భిణీలకు కిట్ లను అందించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఈ మేరకు కామారెడ్డి కలెక్టరేట్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్రంలోని గర్భిణీలకు రక్తహీనత ఉండకూడదనే ఉద్దేశంతోనే పౌష్టికాహార కిట్లు అందిస్తున్నామని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. ప్రతి గర్భిణీకి రెండు సార్లు కిట్‌ అందిస్తామని.. కిట్‌లోని ఆహారాన్ని తప్పక తీసుకోవాలని సూచించారు. కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్ అని.. కాన్పు అయ్యాక ఇచ్చేది కేసీఆర్ కిట్ అంటూ మంత్రి వివరించారు. ప్రతి గర్భిణికి రెండు సార్లు కిట్లు ఇస్తామన్నారు. దీని విలువ 2 వేల రూపాయలు ఉంటుందన్నారు. కేసీఆర్ పనులు ఎక్కువ చేస్తున్నారు.. బీజేపీ మాత్రం పన్నులు ఎక్కువ వేస్తుందని ఆయన విమర్శించారు. పనులు చేయడం బీఆర్ఎస్ వంతు, పన్నులు వేయడం బీజేపీ వంతు అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. శిశు , తల్లి మరణాలు తగ్గించి తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉందన్నారు. త్వరలో టిఫా స్కానింగ్ కూడా ప్రారంభిస్తామని కీలక ప్రకటన చేశారు హరీష్ రావు. బీఆర్‌ఎస్‌వి న్యూట్రిషన్‌ పాలిటిక్స్‌ అని.. ప్రతిపక్షాలవి పార్టిషన్‌ పాలిటిక్స్‌ అంటూ మంత్రి మండిపడ్డారు.

MLC Kavitha: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కవిత కౌంటర్‌

రక్తహీనత ఎక్కువగా నమోదవుతున్న ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్‌ల‌లో బుధవారం కిట్ల పంపిణీని చేపట్టారు. చేపట్టనుంది. ఆయా జిల్లాల్లో స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా కేసీఆర్‌ పోష్టికాహార కిట్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. గర్భిణీల కోసం రూపొందించిన ఒక్కో కిట్ విలువల 1962 రూపాయలు కాగా… ఒక్కో కిట్‌లో ఒక కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, ఒక కేజీ ఖర్జూర, 3 ఐరన్ సిరప్ బాటిళ్లు, 500 గ్రాముల నెయ్యి, ఆల్‌బెండ‌జోల్ టాబ్లెట్‌, ఒక కప్పుని ప్లాస్టిక్ బాస్కెట్ లో పెట్టి అందించనున్నారు. గర్భిణీలకు పోషకాహారం అందించి రక్తహీనతను తగ్గించడం, హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడమే కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల లక్ష్యం. ప్రాథమికంగా 9 జిల్లాల్లో కిట్ల పంపిణీ చేపట్టినప్పటికీ భవిష్యత్‌లో అన్ని జిల్లాలకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తరించనుంది.