సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో ఆఫీసులో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకు ముందు సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన అనంతరం పట్టణంలో ఈద్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేసి ఆర్వో కార్యాలయానికి బయల్దేరి వెళ్లారు.
Read Also: Singham Again : వైరల్ అవుతున్న కరీనా కపూర్ ఫస్ట్ లుక్..
కాగా, మంత్రి హరీశ్ రావు 2004 నుంచి సిద్దిపేట నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో 24 వేల 827 మెజార్టీతో గెలిచారు. 2008 ఉప ఎన్నికల్లో 58 వేల 935 మెజార్టీతో గెలవగా.. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో తన మెజారిటీని హరీశ్ రావు పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 వేల 14 ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవికి రాజీనామా చేసిన ఆయన.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95 వేల 858 ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఇక, తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 93 వేల 328 ఓట్ల మెజారిటీ, 2018 ఎన్నికల్లో ఒక లక్ష 18 వేల 699 మెజార్టీతో విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలకు మంత్రి హరీశ్ రావు కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా చేశారు.