NTV Telugu Site icon

Gudivada Amarnath: ఏపీలో పారిశ్రామిక విప్లవం.. చంద్రబాబు నుంచే పవన్‌కు ప్రాణహాని..!

Gudivada Amarnath,

Gudivada Amarnath,

Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవం రాబోతుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో చేసిన ఎంఓయూలను గ్రౌండ్ చేశాం.. రికార్డు సమయంలో గోద్రెజ్ సంస్థను ఏర్పాటు చేశాం అన్నారు.. ప్రభుత్వం వేగంగా సహకరిస్తోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని గుర్తుచేసుకున్న ఆయన.. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం వస్తుంది.. ఏపీకి గతంలో ఎన్నడూ రాని పెద్ద పెద్ద కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం పరిశ్రమలు వెళ్లి పోతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.. మేం ఏ పరిశ్రమని ఇబ్బంది పెట్టామో చెప్పాలి అని డిమాండ్‌ చేసిన ఆయన.. చంద్రబాబు హెరిటేజ్ ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టమా..? చంద్రబాబు చూపించాలన్నారు.

ఇక, పవన్‌ కల్యాణ్‌ దత్తపుత్రుడు పేరు సార్ధకం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు గుడివాడ.. ఒకే రోజు రెండు పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అందుకే సీఎం జగన్ ఆయనకి దత్తపుత్రుడు అని పేరు పెట్టారన్న ఆయన.. హైదరాబాద్ పారిపోయింది చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లే కదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. సింపతీ కోసం పవన్ కల్యాణ్‌ ప్రాణహాని ఉందని ఆరోపణ చేస్తున్నాడని మండిపడ్డారు మంత్రి.. అయితే, చంద్రబాబు వల్లే పవన్ కి ప్రాణహాని ఉండొచ్చు అంటూ సంచలన ఆరోపణల చే శారు.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని చంపేద్దమనుకున్న వ్యక్తి చంద్రబాబు.. కానీ, చంద్రబాబు బిస్కెట్ల కోసం కాపులను తాకట్టు పెట్టాలని పవన్‌ కల్యాణ్‌ చూస్తున్నాడంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

కాగా, ఏపీలో మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి.. ఈ రోజు ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో మూడు కంపెనీల నిర్మాణ పనులకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్‌ పుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించి, శంకుస్ధాపన చేయడంతో పాటు గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించిన విషయం విదితమే.