Minister Gottipati Ravi Kumar: కడపలో విద్యుత్ షాక్ కొట్టి ఓ విద్యార్థి చనిపోయిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సీరియస్ అయ్యారు. వరుస ఘటనలపై సీఎండీలతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి గొట్టిపాటి హెచ్చరించారు. విద్యుత్ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని సూచించారు. విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ వైర్ లాగడానికి ప్రయత్నించిన తరుణంలో విద్యుత్ తీగ కిందపడినట్లు అధికారులు వివరించారు. విద్యుత్ తీగలు వేలాడుతున్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి వాటికి మరమ్మతులు చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేసారు. కడప ఘటన బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read Also: CM Chandrababu: రేపు అచ్యుతాపురం వెళ్లనున్న సీఎం చంద్రబాబు
కడప నగరంలోని అగాడి వీధలో విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మధ్యాహ్నం తన్నీవుల్ రెహమాన్(11), అద్నాన్(10) అనే విద్యార్థులు స్కూల్‌కు వెళ్తుండగా.. తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు విద్యార్థులు అక్కడే కుప్పకూలిపోయారు. విద్యుత్ షాక్ వల్ల చెలరేగిన మంటల్లో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా తన్నీవుల్ రెహమాన్ అనే విద్యార్థి మృతి చెందాడు. అద్నాన్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
