Site icon NTV Telugu

Minister Chelluboina Venu: మరింత మెరుగైన ఫీచర్స్‌తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Minister Venugopala Krishna

Minister Venugopala Krishna

Minister Chelluboina Venu: మరింత మెరుగైన ఫీచర్స్‌తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపడుతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ చేపడతామన్నారు. ఆరోగ్య శ్రీ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో జబ్బున్న వాళ్లను జల్లెడ వేసి పట్టామని.. ఆరోగ్యశ్రీ అవగాహన, ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద రూ. 300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో వివిధ స్ఖాయిల్లో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా వెల్లడించారు. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు జరుగుతుందన్నారు.

Read Also: Minister Ambati Rambabu: పవన్‌కు తన పార్టీపై తనకే స్పష్టత లేదు..

ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ ఉంటుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కూడా పంపిణీ జరుగుతుందని మంత్రి తెలిపారు. జనవరి 10 నుంచి 23 వరకు మహిళలకు ఆసరా నాలుగో విడత కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. జనవరి చివరి నుంచి చేయూత కార్యక్రమం ఉంటుందన్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఆర్ధిక సహాయం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రూ. 3 వేల మేర వృద్ధాప్య ఫించన్ ఇస్తామని మంత్రి వెల్లడించారు. వచ్చే నెల 8వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేపడతామన్నారు. ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు.

“ఇకపై ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం మెరిటైం బోర్డు పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విశాఖ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం. కుల, ఆదాయ ధృవపత్రాల జారీలో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం. సెల్ఫ్ డిక్లరేషన్ మీద కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీకి కేబినెట్ ఆమోదం.” తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.

కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..
*సామాజిక పెన్షన్‌లను రూ. 2,750 నుంచి రూ. 3,000 వేలకు పెంపు

*ఆరోగ్యశ్రీలో పేదలకు రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం

*90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు

*ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ

*విశాఖలో లైట్‌ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్‌ ఆమోదం

*ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం
*జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు మంత్రివర్గం ఆమోదం

*కుల, ఆదాయ ధ్రువీకరణాల పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్‌ ఆమోదం

*కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్‌ చెల్లింపు

*యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌లో పనిచేసే టీమ్స్‌కు 15శాతం అలవెన్స్‌ పెంపు

*51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మంది రిజిస్ట్రేషన్‌

*కేబినెట్‌ సబ్‌కమిటీ, స్టీరింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ఆమోదం

*ఆడుదాం ఆంధ్రా బ్రాండ్‌ అంబాసిడర్‌గా అంబటి రాయుడు

Exit mobile version