NTV Telugu Site icon

Minister Anam Ramanarayana Reddy: ప్రతిష్టాత్మకంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లపై మంత్రి ఆనం సమీక్ష..

Anam

Anam

Minister Anam Ramanarayana Reddy: రొట్టెల పండుగ అనగానే నెల్లూరు బారా షహీద్‌ దర్గా గుర్తుకు వస్తుంది.. మొక్కు కోవడానికి.. మొక్కులు చెల్లించుకోవడానికి.. ఇలా ప్రత్యేక రొట్టులు సమర్పించుకుంటారు భక్తులు.. దీనిని రోటియాన్ కి ఈద్ లేదా రొట్టెల పండుగగా నిర్వహిస్తారు.. ప్రతీ ఏడాది మూడు రోజుల పాటు ఈ పండుగ నిర్వహిస్తారు.. ముహర్రం నెలలో వార్షిక కార్యక్రమం జరుపుకుంటారు. ఆలయాన్ని సందర్శించిన మహిళలు నెల్లూరు ట్యాంక్‌లో రోటీలు మార్చుకుంటారు.. ఇక, బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తాం అన్నారు. దర్గా వద్ద ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం.. దర్గా పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేకంగా వైద్య బృందాలను అందుబాటులో ఉంచుతాం.. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అధికారులు సిబ్బంది వ్యవహరించాలని సూచించారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

Read Also: Tamannah: వివాదంలో తమన్నా.. 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా జీవిత చరిత్ర?

ఇక, సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో దర్గా ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశాం.. 2014-19 మధ్య కాలంలో దర్గా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.20 కోట్ల రూపాయలను మంజూరు చేశారు.. ప్రస్తుతం ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవు. పురపాలక శాఖకు పన్నుల రూపంలో 3 వేల కోట్ల రూపాయలు వచ్చాయి.. కానీ, వాటిని గత ప్రభుత్వం పూర్తిగా వాడేసిందన్నారు.. దర్గా వద్ద దుకాణాలకు నిర్వహించిన వేలంలో రూ. కోటి 56 లక్షల మేర నిధులు వచ్చాయి.. వాటిని దర్గా అభివృద్ధి కోసం వినియోగిస్తాం అన్నారు.. శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులు ఇబ్బంది పడకుండా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు మంత్రి నారాయణ.